ఏపీలో ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య మళ్లీ యుద్ధం మొదలైంది. కొన్నిరోజుల క్రితం వ్యవహారం చక్కబడిందని.. అంతా భావించిన తర్వాత ఇప్పుడు మళ్లీ రగడ మొదలైంది. పీఆర్సీలో ఫిట్‌మెంట్ విషయంలో ఉద్యోగ సంఘాలు రాజీపడినా.. మిగిలిన విషయాల్లో ప్రభుత్వం పట్టువీడటం లేదని.. ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. అయితే.. ఈ అంశాలన్నీ పూర్తిగా ప్రభుత్వంతో చర్చించకుండానే.. లెక్కలు తేలకుండానే కొన్ని రోజుల క్రితం.. అంతా ముఖ్యమంత్రికి జేజేలు పలుకుతూ మాట్లాడటం ఇబ్బందికరంగా తయారైంది.


ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్‌ లో పడిన ఉద్యోగ సంఘాలు ఇప్పుడు సమరమే అంటున్నాయి. ఏపీ ఈ మేరకు జేఎసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. రేపు సాయంత్రం 5 గంటలకు ఏపీ జేఎసీ, ఏపీ జేఎసీ అమరావతి సంయుక్త సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశం అనంతరం ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ఏపీ జేఎసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు చెబుతున్నారు. సమ్మెకు ఇప్పటికే మేము సంపూర్ణ మద్దతు ప్రకటించామని.. ఆర్టీసీ కార్మికులు కూడా సమ్మెలో పాల్గొంటారని ఆయన అంటున్నారు.


ఆర్టీసీలోని ఈయూ, ఎన్ ఎంయూ సహా అన్ని సంఘాలు సమ్మెలో పాల్గొంటాయని.. ఉద్యమంలోకి అడుగుపెడితే వెనక్కి తగ్గేది ఉండదని బొప్పరాజు చెబుతున్నారు. ఈసారి తాము చేయబోయే  సమ్మె చాలా తీవ్ర రూపం దాల్చుతుందని.. తమ ఉద్యమానికి ప్రజల మద్దతు ఇవ్వాలని కోరుతున్నామని ఆయన అంటున్నారు. ఈ సమ్మె తమ వేతనాల పెంపు కోసమో, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు సమ్మె చేయడం లేదని.. ఇస్తోన్న జీతాలను తగ్గించి గత ప్రభుత్వం ఇచ్చిన అలవెన్సులు కోత వేయడం వల్లే సమ్మె చేస్తున్నామని చెబుతున్నారు.


మరి ఉద్యోగులు సమ్మె వరకూ వెళ్లకుండా జగన్ ఆపుతారా.. లేక.. ఎందాకైనా చూద్దాం అని ఊరుకుంటారా అన్నది తేలాల్సి ఉంది. మొత్తానికి సమసిపోయిందనుకున్న వివాదం మళ్లీ మొదటికి వచ్చేసింది. ఎప్పటికి ఈ వివాదం ఓ కొలిక్కి వస్తుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి: