ఆప్.. ఆమ్‌ ఆద్మీ పార్టీ.. రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభించిన పార్టీ.. దేశంలో ఇలా చాలా మంది రిటైర్డ్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌లు రాజకీయాల్లోకి వచ్చారు.. కొందరు పార్టీలూ పెట్టారు.. కానీ.. అరవింద్‌ కేజ్రీవాల్‌ తరహాలో సక్సస్ అయినవాళ్లు మాత్రం చాలా తక్కువ. ఇక అన్నాహజారేతో కలసి ఎన్నో ప్రజాఉద్యమాల్లో పాల్గొన్న అరవింద్ కేజ్రీవాల్‌ ఆ తర్వాత సొంతంగా పార్టీ పెట్టి దేశ రాజధాని డిల్లీలో కొత్త రాజకీయానికి తెరలేపారు.


చీపురు కట్ట గుర్తుగా.. విద్యావంతులను పార్టీలో చేర్చుకుని.. రొటీన్ రాజకీయాలకు చెక్ పెట్టారు. ఎన్నికలంటే సారా పోయించడం, డబ్బులు పంచడం కాదు.. ఎన్నికలంటే అధికారంలోకి వచ్చాక కోట్లు కూడేసుకోవడం కాదు.. అసలైన రాజకీయం అంటే.. జనం జీవితాలు మార్చడం అని అరవింద్‌ కేజ్రీవాల్ చేసి చూపించారు. అందుకే మొదటి సారి కేవలం 26 సీట్లు గెలుచుని కాంగ్రెస్ మద్దతుతో సీఎం అయిన అరవింద్‌ కేజ్రీవాల్.. ఆ తర్వాత రాజీనామా చేసి ఏకంగా 70 సీట్లలో 67 గెలుచుకుని చరిత్ర సృష్టించారు.


ఢిల్లీలో ఆప్‌ సర్కారు స్వల్ప కాలంలోనే ఎన్నో విజయాలు సాధించింది. ఢిల్లీలో ప్రజాసర్కారుపై లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పెత్తనం ఉన్నా.. సాధ్యమైనంత మేరకు ప్రజలకు మేలు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చేశారు.. బస్తీల్లో మహుల్లా క్లీనిక్‌లు ఏర్పాటు చేశారు. తాగునీరు, కరెంట్‌ విషయాల్లో పేదల కష్టాలు తీర్చారు.. ఇలా ఎన్నో సంస్కరణలు చేపట్టారు. ఇప్పుడు అదే ఆప్‌ పార్టీ పంజాబ్‌లోనూ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది.


పంజాబ్‌లోనూ ఆప్‌ కొత్త రాజకీయం చూపిస్తోంది. అక్కడ సీఎం అభ్యర్థిని ప్రజల విజ్ఞప్తుల నుంచి ఎంపిక చేయడం మన రాజకీయాల్లో ఎన్నడూ చూడని అంశం. అధిష్టానానికి నచ్చినవాడో.. సీల్డ్‌ కవర్లో వచ్చినావాడో కాకుండా.. పారదర్శకంగా జనం మెచ్చిన వాడిని ఎంపిక చేయడం మంచి పరిణామం.. ఇప్పటికే చండీగడ్‌ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన ఆప్... పంజాబ్‌ ఎన్నికల్లో విజయం సాధిస్తే.. అది దేశానికే కొత్త మలుపు కావచ్చు. ఈ రొటీన్ రాజకీయాలకు విరుగుడు కావచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి:

aap