ఉత్త‌ర ప్ర‌దేశ్ ఎన్నిక‌లంటేనే కులాలు, మ‌తాల సంకుల స‌మ‌రం. ఈ స‌మీక‌ర‌ణ‌లన్నీ క‌లిసొస్తేనే ఎవ‌రైనా ఆ రాష్ట్రంలో విజయం సాధించ‌గ‌లిగేది. 2017లో అనూహ్య‌మైన మెజారిటీతో బీజేపీ యూపీని గెలుచుకోవ‌డం వెనుక ఇదే మ‌ర్మం దాగి ఉంద‌ని చెప్పాలి. యోగి ఆదిత్య‌నాథ్ ముఖ్య‌మంత్రి అయ్యాక ఇక ఇత‌ర పార్టీలు కోలుకోవ‌డం క‌ష్ట‌మ‌నే వాతావ‌ర‌ణం కనిపించినా మ‌రోసారి ఎన్నిక‌లు ముంచుకొస్తున్న స‌మ‌యంలో ప‌రిస్థితి మారుతున్న దాఖలాలు స్ప‌ష్టంగానే క‌నిపిస్తున్నాయి. పైకి యూపీలో మ‌ళ్లీ అధికారం బీజేపీదేన‌ని కొన్ని స‌ర్వేలు చెపుతున్నా అవి ఆ పార్టీ క‌నుస‌న్న‌ల్లో అనుకూల మీడియా చేస్తున్న ప్ర‌చార‌మేన‌ని ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి. ప్ర‌జ‌ల్లో యోగి ప్ర‌భుత్వంపై భారీ స్థాయిలోనే వ్య‌తిరేక‌త ఉంద‌ని విప‌క్షాలు అంటున్నాయి. దీనిని రుజువు చేస్తూ ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌ల్లో బీజేపీ నేత‌ల‌కు ప్ర‌జ‌ల నుంచి వ‌రుస ప‌రాభ‌వాలు ఎదురవుతున్నాయి.
       

తాజాగా ముజ‌ఫ‌ర్ న‌గ‌ర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌చారానికి వ‌చ్చిన బీజేపీ ఎమ్మెల్యే విక్ర‌మ్‌సింగ్ సైనీని ఓ గ్రామంలో ప్ర‌జ‌లు త‌రిమికొట్టారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట వైర‌ల్‌గా మారాయి. కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన‌ వివాదాస్ప‌ద వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు రైతుల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అప్ప‌టినుంచి ఆ ఎమ్మెల్యే త‌న నియోజ‌క‌వ‌ర్గానికి వ‌చ్చేందుకు కూడా సాహ‌సించ‌లేద‌ని తెలుస్తోంది. అంతేకాదు.. ఆయ‌న ఓ మ‌త వ‌ర్గానికి వ్య‌తిరేకంగా గ‌తంలో చేసిన వ్యాఖ్య‌లు కూడా వివాదాస్ప‌దంగా మారాయి. ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే నియోజ‌క‌వ‌ర్గానికి రాలేని ప‌రిస్థితి ఉందంటే ఆ ప్ర‌భుత్వంపై ఉన్న వ్య‌తిరేక‌త‌ను అంచ‌నా వేసుకోవ‌చ్చ‌ని విప‌క్షాలు అంటున్నాయి.
         

ముప్పై ఏళ్ల క్రితం రామ‌జ‌న్మ‌భూమి అంశాన్ని మ‌రోసారి తెర‌మీద‌కు తెచ్చి దాన్నో ఉద్య‌మంగా మ‌లిచి హిందూ ఓట్ల‌ను సంఘ‌టితం చేయ‌డం ద్వారా బ‌లం పెంచుకున్న బీజేపీ 1991లో క‌ల్యాణ్‌సింగ్ ముఖ్య‌మంత్రిగా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌గ‌లిగింది. అయితే దేశ‌వ్యాప్తంగా ప‌లు ప్రాంతాల నుంచి త‌ర‌లివ‌చ్చిన క‌ర‌సేవ‌కులు అయోధ్య‌లోని బాబ్రీ మ‌సీదును కూల్చిన ఘ‌ట‌న నేప‌థ్యంలో క‌ల్యాణ్‌సింగ్ ప్ర‌భుత్వం ర‌ద్ద‌యింది. ఆ త‌రువాత బీఎస్పీకి మ‌ద్దతిస్తూ కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంప్ర‌దాయ ఓటుబ్యాంకును బ‌ల‌హీన‌ప‌ర‌చే వ్యూహాన్ని అనుస‌రిస్తూ వచ్చింది. 1997లో రెండోసారి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసినా అప్పుడూ పూర్తిస్థాయిలో బ‌లం పుంజుకోలేక‌పోయింద‌న్న‌ది నిజం. 2017లో మాత్రం అటు మ‌తప‌రంగాను, ఇటు కుల స‌మీక‌ర‌ణ‌ల్లోను బీజేపీ అనుస‌రించిన వ్యూహం విజ‌య‌వంత‌మైంది. ఇప్పుడు రెండోసారి యూపీలో పాగా వేయ‌డం ద్వారా 2024లో ఢిల్లీ పీఠాన్ని ద‌క్కించుకోవ‌డానికి మార్గం సుగ‌మం చేసుకోవాల‌ని శ‌క్తివంచ‌న లేకుండా ప్ర‌య‌త్నిస్తోంది. కానీ  ప్ర‌స్తుతం ఆ రాష్ట్రంలో క్షేత్ర‌స్థాయిలో నెల‌కొన్న ప‌రిస్థితులు బీజేపీకి వ‌ణుకు పుట్టిస్తున్నాయ‌న్న అంశం మాత్రం వాస్త‌వం.


మరింత సమాచారం తెలుసుకోండి: