టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోని ఒక నియోజ‌క‌వ‌ర్గానికి అభ్య‌ర్థి కావాలా? అక్క‌డ వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు అభ్య‌ర్థి కోసం వెతుకుతున్నారా? అంటే..ఔన‌నే అంటున్నారు పార్టీ నేత‌లు. అదే.. తిరుప‌తి అసెంబ్లీ నియ‌జ‌క‌వ‌ర్గం. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస‌గా సుగుణ‌మ్మ‌పోటీ చేశారు. 2014లో సుగుణ‌మ్మ భ‌ర్త విజ‌యం ద‌క్కించుకున్నారు. 2012 ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మున్నూరు వెంక‌ట ర‌మ‌ణ ఓడిపోయారు. ఆ త‌ర్వాత 2014 సాధార‌ణ ఎన్నిక‌ల్లో ఆయ‌న ఏకంగా 41 వేల ఓట్ల భారీ మెజార్టీతో భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డిని ఓడించారు. అయితే.. ఆయ‌న అనారోగ్యం కార‌ణంగా మ‌ర‌ణించ‌డంతో వ‌చ్చిన ఉప ఎన్నిక‌లో ఆమె విజ‌యం ద‌క్కించుకున్నారు.

వెంక‌ట‌ర‌మ‌ణ మ‌ర‌ణాంత‌రం జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో సుగుణ‌మ్మ ఏకంగా ల‌క్ష ఓట్ల మెజార్టీతో ఘ‌న‌విజ‌యం సాధించారు. అయితే గ‌త ఎన్నిక‌ల్లో మ‌రోసారి పోటీ చేసినా.. ఓడిపోయారు. గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ప్ర‌భంజ‌నంలోనూ సుగుణ‌మ్మ కేవ‌లం వెయ్యి లోపు స్వ‌ల్ప తేడాతో మాత్ర‌మే ఓడిపోయారు. ఇక‌, ఇప్ప‌టికీ.. పార్టీలో యాక్టివ్‌గా ఉన్న‌ప్ప‌టికీ.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి.. పార్టీల మ‌ధ్య‌పోరు తీవ్రంగా ఉం టుంద‌ని వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో సుగుణ‌మ్మ ఆ పోటీని త‌ట్టుకునే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. దీంతో ఆమెను ప‌క్క‌న పెట్టి.. ఆమెస్థానంలో వేరే నాయ‌కుడిని ఎంపిక చేయాల‌ని పార్టీ అధిష్టానం చూస్తోంది.

ఇటీవ‌ల చంద్ర‌బాబు కుప్పం నియోజ‌క‌వ‌ర్గంపై జ‌రిపిన స‌మీక్ష‌లో ఈ నియోజ‌క‌వ‌ర్గం విష‌యం కూడా చ‌ర్చ‌కు వ‌చ్చింది. సుగుణ‌మ్మ‌కు పార్టీలో కానీ.. లేదా ప్రభుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. శాస‌న మండ‌లికి కానీ.. పంపించి.. ఆమె స్థానంలో మ‌రో నేత‌ను నిల‌బెట్టాల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చారు. ప్ర‌స్తుతం వైసీపీ త‌ర‌ఫున ఇక్క‌డ‌.. భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ఈయ‌న ఫైర్ బ్రాండ్ కాక‌పోయినా.. ప్ర‌జ‌ల్లో మంచి పేరు అయితే.. సాధించారు. క‌రోనా స‌మ‌యంలోను.. వ‌ర‌ద‌ల స‌మ‌యంలో ను ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉన్నారు.

దీంతో సైలెంట్‌గా ఆయ‌న‌కు పాజిటివిటీ పెరిగింది.  ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త వ‌చ్చినా.. వ్య‌క్తిగ‌తంగా భూమ‌న‌కు అవ‌కాశం క‌ల్పిస్తార‌ని.. ఇక్క‌డ రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో భూమ‌న‌ను ఎదిరించి నిల‌బ‌డి.. విజ‌యం ద‌క్కించుకునే నాయ‌కుడి కోసం చంద్రబాబు ప‌రిశీలిస్తున్న‌ట్టు.. తెలుస్తోంది. మ‌రి ఎవ‌రికి అవ‌కాశం ద‌క్కుతుందో చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: