ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగ సంఘాల ఆందోళన తీవ్రమవుతోంది. వచ్చేనెల 7 నుంచి సమ్మెకు దిగుతామని ఉద్యోగ సంఘ నేతలు ప్రకటించారు. ఇందుకు కార్యాచరణ కూడా వారు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే.. ఇప్పటికే ఉద్యోగ సంఘ నేతలతో నేరుగా చర్చలు జరిపి కొన్ని ప్రతిపాదనలు పెట్టిన సీఎం జగన్.. ఈ సారి మాత్రం ముక్కుసూటిగా ముందుకే వెళ్తానంటున్నారని తెలిసింది. ఇప్పటికే ఉద్యోగుల కోసం ఇవ్వాల్సినంత ఇస్తున్నామని.. ఇంకా అడిగితే మాత్రం ఇవ్వలేమని సీఎం అన్నట్టు తెలిసింది.


ఉద్యోగులు కోరినట్టు హెచ్‌ఆర్‌ఏ పెంచితే ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిలిపివేయాల్సి ఉంటుందని సీఎం జగన్ కేబినెట్‌ భేటీలో అన్నట్టు తెలిసింది. నవరత్నాల పేరిట అమలు చేస్తున్న ఏ ఒక్క పథకాన్నీ ఆపే ప్రసక్తే లేదని సీఎం ఖరాఖండీగా చెప్పినట్టు తెలిసింది. నవరత్నాలను నిలిపివేస్తే రాజకీయంగా లబ్ధి పొందవచ్చని టీడీపీ ప్లాన్‌ వేస్తోందని సీఎం అన్నారట. అందుకే.. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిలోని ఏ ఒక్క పథకాన్ని ఆపబోనని తేల్చి చెప్పారట.


జగన్ తీరు చూస్తే.. ఉద్యోగుల కంటే తనకు జనం.. జనానికి ఇచ్చిన మాటే ముఖ్యమని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అంతే కాదు.. ఉద్యోగుల కోసం ఏం చేస్తున్నాం.. ఉద్యోగ సంఘాలు ఏం అడుగుతున్నాయి.. ఉద్యోగ సంఘాలు అడిగిన దాన్ని ఎందుకు ఇవ్వలేకపోతున్నామో.. వైసీపీ నాయకులు జనంలోకి వెళ్లి వివరించాలని సీఎం జగన్ కోరినట్టు తెలిసింది.


దీన్ని బట్టి చూస్తే.. ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వం మధ్య తలెత్తిన ఈ గొడవ ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. అయితే.. ఈ పరిస్థితిని టీడీపీ, ఇతర పార్టీలు రాజకీయంగా వాడుకునే అవకాశం ఉందన్న చర్చ కూడా కేబినెట్ భేటీలో జరిగింది. అయితే.. ఏది ఏమైనా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలే తనకు ముఖ్యమంత్రి సీఎం జగన్ నిర్ణయించుకున్నారు. కరోనా సమయంలో ఆదాయం తగ్గడం వల్లే ఉద్యోగులకు కాస్త తక్కువ ఇవ్వాల్సి వస్తుందన్న విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెబితే జనం  అర్థం చేసుకుంటారన్నది ఆయన ఆలోచనగా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: