ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం. కాపుల రిజ‌ర్వేష‌న్ కోసం గ‌ళం వినిపించిన నాయ‌కుడిగా.. కేంద్ర మాజీ మంత్రి అంద‌రికీ గుర్తుండే ఉంటారు. చంద్ర‌బాబు హ‌యంలో కాపుల  కోసం రోడ్డెక్కిన విష‌యం తెలిసిందే. అయితే.. జ‌గ‌న్ స‌ర్కారు వ‌చ్చిన త‌ర్వాత‌.. కొన్ని నెల‌ల‌కే ఆయ‌న త‌న ఉద్య‌మాన్ని విర‌మించారు. ఇక‌, అప్ప‌టి నుంచి వైసీపీ ప్ర‌భుత్వానికి త‌ర‌చుగా లేఖ‌లు రాస్తున్నారు. ఆయా స‌మ‌స్య‌ల‌పై ఆయ‌న స్పందిస్తున్నారు. మ‌ద్యం ధ‌ర‌ల పెంపు, బ్రాండెడ్ మ‌ద్యం లేక పోవ‌డం వంటి విష‌యాల‌పై నెల కింద‌ట లేఖ రాశారు.

మ‌రి ముద్ర‌గ‌డ లేఖ ఎఫెక్టో..ఏమో తెలియదు కానీ.. వెంట‌నే జ‌గ‌న్ ప్ర‌భుత్వం రాష్ట్రం బ్రాండెడ్ మ‌ద్యాన్ని తీసుకువ‌చ్చింది. ఇక‌, ఇసుక‌పైనా.. ఆయ‌న లేఖ‌లు రాశారు. త‌ర్వాత‌.. దానిని ఆన్‌లైన్ చేశారు. ఇలా.. ముద్ర‌గ‌డ లేఖ‌రాయ‌డం.. ఆ త‌ర్వాత‌.. అటు ఇటుగా కొన్నాళ్ల‌కు వైసీపీ స‌ర్కారు స్పందించ‌డం తెలిసిందే. ఇక‌, ఇప్పుడు రాష్ట్రంలో పేద‌లు గ‌గ్గోలు పెడుతున్న ప‌థ‌కం ఓటీఎస్‌. గ‌తంలో అంటే.. 30, 40 ఏళ్ల కింద‌ట పేద‌లకు ప్ర‌భుత్వాలుక‌ట్టించిన ఇళ్ల‌కు సంబంధించిన బ‌కాయిలు వ‌సూలు చేసుకునే కార్య‌క్ర‌మానికి జ‌గ‌న్ ప్ర‌భుత్వం శ్రీకారం చుట్టింది.

దీనిని చాలా చోట్ల ప్ర‌జ‌లు వ్య‌తిరేకిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ.. ప్ర‌జ‌ల‌కు మేలు చేస్తుంద‌ని చెబుతూ.. స‌ర్కారు మాత్రం ముందుకే వెళ్తోంది. ప్ర‌తిప‌క్షాలు కూడా ఈ ఓటీఎస్‌ను తీవ్రంగా త‌ప్పుబ‌ట్టాయి. తాము అధికారంలోకి వ‌స్తే.. పేద‌ల‌కు ఉచితంగానే రిజిస్ట్రేష‌న్ చేసి.. ఆయా ఇళ్ల‌ను సొంతం చేస్తామ‌ని కూడా చెప్పాయి. అయితే.. ఇప్పుడు ఇదే అంశంపై ముద్ర‌గ‌డ ఏపీ సీఎం జ‌గ‌న్‌కు లేఖ రాశారు. ఓటీఎస్ పేరుతో పేద ప్రజలపై ఒత్తిడి తేవద్దని, గత ప్రభుత్వ హాయంలో చేసిన పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు వెంటనే చెల్లించాలని త‌న లేఖ‌లో సీఎంను కోరారు.

``గత ప్రభుత్వం హయాంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించని మీకు… గత ప్రభుత్వాలు పేదలకు కట్టి ఇచ్చిన ఇళ్లకు ఓటీఎస్ వసూలు చేసే అధికారం ఎక్కడిది`` అంటూ జ‌గ‌న్‌ను నిలదీశారు. ఓటీఎస్ వ‌ల్ల ఎంతో మంది పేద‌లు.. క‌నీసం క‌డుపునిండా అన్నం తిన‌లేని ప‌రిస్తితి వ‌చ్చింద‌ని... కంటి నిండా నిద్ర కూడా పోలేక పోతున్నార‌ని.. క‌రోనా కార‌ణంగా..ఇప్ప‌టికే ఉపాధి కోల్పోయిన ప్ర‌జ‌ల‌కు ఇ ప్పుడు గోరుచుట్టుపై రోక‌లి పోటు మాదిరిగా ఓటీ ఎస్ అంటే.. ఎలా? అని ప్ర‌శ్నించారు. ఈ క్ర‌మంలో త‌క్ష‌ణ‌మే ఓటీఎస్‌నువెన‌క్కి తీసుకోవాల‌ని ముద్ర గ‌డ లేఖ‌లో కోరారు. మ‌రి దీనిపై స‌ర్కారు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: