చిత్తూరు జిల్లాలో పుంగనూరు నియోజకవర్గం అంటే గతంలో టీడీపీకి కంచుకోట. ఇక్కడ టీడీపీ అనేక పర్యాయాలు గెలిచింది. అసలు 1983 నుంచి 1996 ఉపఎన్నిక వరకు పుంగనూరులో టీడీపీ విజయాలకు బ్రేక్ పడలేదు. 1999 ఎన్నికల్లో తొలిసారి టీడీపీ ఓడిపోయిది. మళ్ళీ 2004లో గెలిచింది. కానీ 2009 ఎన్నికల నుంచి సీన్ మారిపోయింది. ఎప్పుడైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు బరిలో అడుగుపెట్టారో...అప్పటినుంచి టీడీపీకి కష్టాలు మొదలయ్యాయి. 2009లో కాంగ్రెస్ నుంచి పెద్దిరెడ్డి గెలిచారు. అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉండటం, పెద్దిరెడ్డి మంత్రిగా ఉండటంతో పుంగనూరు రాజకీయాలని మార్చేశారు. అక్కడ టీడీపీని దెబ్బకొడుతూ వచ్చారు.

పుంగనూరులో తన బలాన్ని పెంచుకున్నారు. దీంతో 2014లో వైసీపీ నుంచి పెద్దిరెడ్డి సత్తా చాటారు. అప్పుడు అధికారంలో లేకపోయినా తన బలం తగ్గలేదు. ఇదే క్రమంలో 2019లో పెద్దిరెడ్డి భారీ మెజారిటీతో గెలిచేశారు. ఇక ఇక్కడ నుంచే సీన్ మారింది. అసలు పుంగనూరులో టీడీపీ ఉనికే లేకుండా చేయడం మొదలుపెట్టారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీని పోటీలోనే లేకుండా చేశారు. పుంగనూరు మాత్రమే కాదు చిత్తూరు జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో టీడీపీని దెబ్బకొట్టే ప్రయత్నాలు మొదలుపెట్టారు.

ఆఖరికి చంద్రబాబు సొంత స్థానం కుప్పంలో కూడా టీడీపీని దెబ్బతీశారు. ఇలా చిత్తూరులో పెద్దిరెడ్డి హవా పూర్తిగా వచ్చింది. దీంతో చంద్రబాబు అలెర్ట్ అయ్యారు. కుప్పంలో పరిస్తితులని చక్కదిద్దుతూనే, పుంగనూరులో పెద్దిరెడ్డికి చెక్ పెట్టే ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. ఈ క్రమంలోనే కొత్త ఇంచార్జ్ చల్లా రామచంద్రారెడ్డిని పెట్టారు. ఇక ఆయన దూకుడుగా పనిచేయడం మొదలుపెట్టారు. అయితే పుంగనూరులో పెద్దిరెడ్డికి చెక్ పెట్టడం అంత ఈజీ కాదు.

కానీ చెక్ పెట్టడానికి కొన్ని అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా పుంగనూరు ప్రజల్లో టీడీపీపై నమ్మకం కలిగించాలి. అలాగే క్షేత్ర స్థాయిలో టీడీపీ నేతలు, కార్యకర్తలు భయపడకుండా పనిచేయాలి. ఏ సమస్య వచ్చినా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అన్నిటికంటే ముఖ్యంగా పొత్తు ముఖ్యం...టీడీపీకి జనసేనతో పొత్తు ఉంటే పెద్దిరెడ్డిని ఆపవచ్చు. గత ఎన్నికల్లో పుంగనూరులో జనసేనకు 16 వేల ఓట్లు పడ్డాయి. కాబట్టి జనసేనని కలుపుకుంటే పెద్దిరెడ్డికి టఫ్ ఫైట్ ఇవ్వొచ్చు...ఇంకొంచెం కష్టపడితే పెద్దిరెడ్డికి చెక్ పెట్టొచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: