వైసీపీ నేత‌ల‌ను కేసులు వేధిస్తున్నాయి. జిల్లాల్లో కోర్టుల చుట్టూ.. నాయ‌కులు తిరుగుతున్నారు. అదేంటి?  పార్టీనే అధికారంలో ఉంది క‌దా..వారికి కేసులు ఏంటి? అని అనుకుంటున్నారా?  ఈ కేసులు.. ఇప్పుడు వైసీపీ హ‌యాంలో పెట్టిన కేసులు కావు. గ‌త చంద్ర‌బాబు హ‌యాంలో పెట్టిన కేసులు. అవి కూడా దాదాపు ఐదేళ్లుగా ఉన్న కేసులు. కాపు ఉద్య‌మం స‌మ‌యంలో.. తునిలో జ‌రిగిన ర‌త్నాచ‌ల్ ఎక్స్‌ప్రెస్ ద‌హ‌నం, అల్ల‌ర్లు, పోలీసు స్టేష‌న్ల‌పై దాడుల‌కు సంబంధించిన కేసులు. త‌ర్వాత‌.. అమ‌రావ‌తిలో అర‌టి తోట ద‌హ‌నం కేసులో పెట్టిన కేసులు.

ఇక‌, సీఎం జ‌గ‌న్ విశాఖ‌ప‌ట్నం విమానాశ్ర‌యంలో ధ‌ర్నా చేసిన‌ప్పుడు.. దీనికి మ‌ద్ద‌తుగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయ‌కులు ఉద్య‌మించినప్పుడు.. అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు హ‌యాంలో నమోదైన కేసులు. అయితే.. అప్ప‌ట్లో అంటే..వైసీపీ నేత‌ల‌పై రాజ‌కీయ ఉద్దేశంతో అయిన‌దానికీ కానిదానికి.. కేసులు న‌మోదు చేశార‌ని.. నాయ‌కులు ఆరోపించిన విష‌యం తెలిసిందే. దీంతో కేసుల నిమిత్తం ఇప్ప‌టికీ.. వైసీపీ నేత‌లు కోర్ట‌ల చుట్టు తిరుగుతున్నారు. వీరిలో కీల‌క నాయ‌కులు కూడా ఉన్నారు. ఉదాహ‌ర‌ణ‌కు తుని కేసులో మంత్రి పినిపే విశ్వ‌రూప్ ఉన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు, కొంద‌రు ఎంపీలుకూడా కేసులు ఎదుర్కొంటున్నారు.

అయితే.. వాస్త‌వానికి ఏ పార్టీ నేత‌ల‌పై కేసులు పెట్టారో.. ఆ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. స‌ద‌రు కేసుల‌ను వెన‌క్కి తీసుకోవ‌డం ఏపీలో ఆన‌వాయితీగా వ‌స్తోంది. కానీ, వైసీపీ హ‌యాంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఇలాంటి చ‌ర్య‌లు తీసుకోలేదు. దీంతో ఇటీవ‌ల జ‌రిగిన కేబినెట్ స‌మావేశంలో పినిపే విశ్వ‌రూప్ స‌హా మ‌రికొంద‌రు మంత్రులు.. ఈ విష‌యాన్ని సీఎం జ‌గ‌న్ వ‌ద్ద ప్ర‌స్తావించారు. మ‌న‌ప్ర‌భుత్వం వ‌చ్చినా... మాకు రిలీఫ్ లేకుండా పోయింద‌ని.. కోర్టుల చుట్టూ తిర‌గ‌లేక కాళ్ల‌రిగిపోతున్నాయ‌ని.. వారు చెప్పారు.  

అవ‌న్నీ ఉద్దేశ పూర్వ‌కంగా..పెట్టిన‌వేన‌ని.. వీటిని వెన‌క్కి తీసుకునేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని..వారు కోరారు. దీంతో సీఎం జ‌గ‌న్ హోం మంత్రి సుచ‌రిత‌ను ఆయా కేసులు వెన‌క్కి తీసుకునేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. అయితే.. ఇప్ప‌టికే.. కొంద‌రు వైసీపీ నేత‌ల‌పై ఉన్న కేసుల‌ను వెన‌క్కి తీసుకుంటూ.. ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను హైకోర్టు నిలిపివేసిన నేప‌థ్యంలో వైసీపీ నేతల వేద‌న ఎప్ప‌టికి తీరుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: