బీకాంలో ఫిజిక్స్‌.. ఈ రకంగా బాగా పాపుల‌ర్ అయిన నాయ‌కుడు.. విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్. కాంగ్రెస్ పార్టీతో రాజ‌కీయ అరంగేట్రం చేసిన జ‌లీల్‌.. త‌ర్వాత‌...అవ‌స‌రం కోసం అన్నట్టుగా.. మ‌రో రెండు పార్టీలు మారారు. 2004 ఎన్నిక‌ల వేళ ఆయ‌న విజ‌య‌వాడ ప‌శ్చిమం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి కూడా సీటు ద‌క్కించుకోలేక‌పోయారు. అది నిజంగా ఆయ‌న రాజ‌కీయ జీవితంలో పెద్ద బ్యాడ్ ల‌క్‌. క‌మ్యూనిస్టుల‌తో పొత్తులో భాగంగా ఆయ‌న‌కు సీటు రాలేదు. ఆ ఎన్నిక‌ల‌కు ముందు వైఎస్‌ను తిట్టి టీడీపీలోకి వెళ్లిన జ‌లీల్ ఆ త‌ర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్నారు.

2009లోనూ ఆయ‌న ఆశ‌లు నెర‌వేర‌లేదు. ఈ క్ర‌మంలోనే వైసీపీ త‌ర‌ఫున 2014లో విజ‌యం ద‌క్కించుకు న్నారు. పార్టీ అధినేత జ‌గ‌న్‌కు జ‌లీల్‌కు మ‌ధ్య అవినాభావ సంబంధాలు కూడా ఉన్నాయి. అయితే.. ఆయ‌న టీడీపీ హ‌యాంలో మంత్రి ప‌ద‌విని ఆశించి.. వైసీపీ నుంచి జంప్ చేశారు. అయితే, అనూహ్య ప‌రిణామాల నేప‌థ్యంలో చంద్ర‌బాబు ఆయ‌న‌కు ప‌ద‌వి ఇవ్వ‌లేదు. ఇదిలావుంటే... గ‌త 2019లో త‌న కుమార్తె ఖ‌తూన్‌ను రంగంలోకి దింపిన జ‌లీల్‌ఖాన్‌.. శాయ‌శక్తులా పోరాటం చేయించారు. అయితే.. ఆమె ఓడిపోయింది. త‌ర్వాత‌.. అమెరికా వెళ్లిపోయారు.

ఇదిలావుంటే.. ఇక్క‌డ నుంచి ఇప్పుడు జ‌లీల్‌కు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఈ సీటును ఎంపీ కేశినేని నాని ఆక్ర‌మించేసుకున్నారు. దీంతో జ‌లీల్ కుటుంబానికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌శ్చిమ టికెట్ ద‌క్క‌ద‌ని స్ప‌ష్టంగా తేలిపోయింది. అస‌లే ఇప్ప‌ట‌కి అక్క‌డ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న‌తో పాటు నాగుల్‌మీరా వ‌ర్గాలు ఉన్నాయి. వీరినే కాద‌ని అక్కడ ఇప్పుడు పార్టీ అధిష్టానం ఎంపీ కేశినేని నానిని కో ఆర్డినేట‌ర్‌గా నియ‌మించింది. ఇక‌, మిగిలిన రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీకి ఎలానూ నేత‌లు ఉన్నారు. దీంతో బీకాంలో ఫిజిక్స్ పీఠం క‌దిలిపోయింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

అయితే.. ఇప్పుడు వైసీపీలోకి వెళ్ల‌లేరు, టీడీపీలోనూ ఉండ‌లేరు.. అదేస‌మ‌యంలో కాంగ్రెస్‌ను ఆశ్ర‌యిం చ లేరు.  ఈ క్ర‌మంలోనే జ‌లీల్‌ఖాన్‌కు ఒక చ‌క్క‌ని ఐడియా వ‌చ్చింది. అదేంటంటే.. హైద‌రాబాద్‌కు చెందిన ఎంఐఎంపార్టీ అయితే.. బెట‌ర్ అని ఆయ‌న భావిస్తున్నార‌ట‌. కొన్ని వ్యాపారాల్లోజ‌లీల్ కూడా భాగ‌స్వామి కావ‌డంతోపాటు.. ఎలానూ ఎంఐఎంను వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలోనూ విస్త‌రించాల‌ని.. అస‌దుద్దీన్ ఒవైసీ కూడా కోరుకుంటున్నార‌ట‌.

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో జ‌లీల్ ఖాన్‌.. ఆ పార్టీలో చేరి.. ఆ పార్టీ త‌ర‌ఫున ప‌శ్చిమ‌లో మ‌రోసారి త‌న కుమార్తెను రంగంలోకి దింపాల‌ని భావిస్తున్న‌ట్టు ప‌శ్చిమ వ‌ర్గాల్లో గుస‌గుస వినిపిస్తోంది.  ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో ముస్లింలు ఎక్కువుగా ఉన్నారు. ఎంఐఎం పోటీ చేయాల‌నుకుంటే ఇక్క‌డ ఆ వ‌ర్గం ఓట‌ర్ల‌ను ఆక‌ర్షిస్తే అది బెజ‌వాడ‌లో మైనార్టీ ఓట‌ర్ల‌పై బ‌ల‌మైన ప్ర‌భావం ఉంటుంది. ఏదేమైనా జ‌లీల్‌ఖాన్ ఎంఐఎంలో చేరితో బెజ‌వాడ‌లో కొత్త రాజ‌కీయం చూస్తాం..!

 

మరింత సమాచారం తెలుసుకోండి: