అప్పుడెప్పుడో ముప్పై ఏళ్ల క్రితం ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గ‌ర్ హీరోగా జేమ్స్ కామెరూన్  ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సైన్స్ ఫిక్ష‌న్ మూవీ టెర్మినేట‌ర్ గుర్తుంది క‌దూ..! దానికి ఆ త‌ర్వాత సీక్వెల్స్ కూడా వ‌చ్చాయి. భ‌విష్య‌త్తులో మ‌నిషి రూపొందించిన రోబోలే సొంతంగా ఆలోచించే శ‌క్తిని స‌మ‌కూర్చుకుని మాన‌వ‌జాతినే అంతం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తాయ‌నే ఇతివృత్తంతో కూడిన ఆ సినిమాల‌ను ప్ర‌పంచ‌మంతా విర‌గ‌బ‌డి చూశారు. ఓ ప‌దేళ్ల క్రితం ర‌జ‌నీకాంత్ క‌థానాయ‌కుడిగా శంక‌ర్ తెర‌కెక్కించిన రోబో మూవీ కూడా దాదాపు ఇలాంటిదే. ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్ అనేది భ‌విష్య‌త్తులో ప్ర‌పంచాన్ని శాసిస్తుంద‌న్న‌ది ఇప్పుడు ప‌లువురు శాస్త్ర సాంకేతిక నిపుణుల న‌మ్మ‌కం. మ‌రి ఇది పైన పేర్కొన్న సినిమాల్లో మాదిరి ప్ర‌మాద‌క‌రంగా ప‌రిణ‌మిస్తే..? ఎల‌క్ట్రిక‌ల్ వాహ‌న త‌యారీ స‌హా ప‌లు ఆధునిక‌త సాంకేతిక‌త‌ల‌ను అభివృద్ది చేస్తూ సంచ‌ల‌న వ్యాపార‌వేత్త‌గా పేరు తెచ్చుకుంటూనే ఇటు ప్ర‌పంచ సంపన్నుల జాబితాలో అగ్ర‌స్థానానికి సునాయాసంగా చేరుకున్న ఎలాన్ మ‌స్క్‌కు ఎప్ప‌టినుంచో ఇదే సందేహం. అస‌లు ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్ అంటేనే ఆయ‌న‌కు తీవ్ర‌ వ్య‌తిరేక‌త ఉంది. అందుకే భ‌విష్య‌త్తులో దానినుంచి ఎదురయ్యే ప్ర‌మాదాన్ని అధిగ‌మించేందుకు ఐదేళ్ల క్రితం మ‌స్క్‌ చేప‌ట్టిన ప్రాజెక్టు న్యూరాలింక్‌.

కృత్రిమ మేధ ఎన్న‌టికీ అధిగ‌మించలేని విధంగా మాన‌వుల ఆలోచ‌నా సామ‌ర్థ్యాన్ని పెంచ‌డం ఈ ప్రాజెక్టు ప్ర‌ధాన ఉద్దేశం. మ‌రి ఇదెలా సాధ్య‌మ‌ని అనుమానం క‌దూ..! మ‌నిషి మెద‌డులో కంప్యూట‌ర్ చిప్‌ను చొప్పించ‌డం ద్వారా ఇది సాధ్య‌మేన‌న్న‌ది మ‌స్క్ ఆలోచ‌న‌. దీనికి సంబంధించిన ప్ర‌యోగాల్లో కూడా ఆయ‌న సంస్థ ఇప్ప‌టికే చాలాముందుకు వెళ్లిపోయింది. ముందుగా పందులు, కోతుల్లో ఈ ర‌క‌మైన చిప్‌ను ప్ర‌యోగించి విజ‌యం సాధించిన‌ట్టు తెలుస్తోంది. ఈ ఏడాది చివ‌రిలోగా ఆ సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని మ‌నుషుల‌పై ప్ర‌యోగించ‌నున్న‌ట్టు కూడా టెస్లా అధినేత ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఈ చిప్‌లోని బ్యాట‌రీ వైర్‌లెస్ విధానంలో ఛార్జి చేసుకునే విధంగా ఉంటుంద‌ట‌. ఈ చిప్ ద్వారా మ‌నుషులు, కంప్యూట‌ర్ల మ‌ధ్య అనుసంధాన వ్య‌వ‌స్థ‌ను సృష్టించ‌వ‌చ్చ‌న్న‌ది నిపుణులు చెపుతున్న‌మాట‌. రోబో చిత్రంలో చిన్ని అనే రోబో ఓ పుస్త‌కంలో ఉన్న‌స‌మాచారాన్నంతా కొన్ని క్ష‌ణాల్లో త‌న‌లోకి డౌన్‌లోడ్ చేసుకున్నట్టుగా మ‌నుషులు కూడా చేసుకోవ‌చ్చ‌న్న‌మాట‌. అలాగే తాను తాకాల్సిన ప‌ని లేకుండానే సంకేతాలు పంపించి యంత్రాల‌ను నియంత్రించ‌గ‌ల‌డు కూడా. అంటే మ‌నిషి సూప‌ర్ హ్యూమ‌న్ బీయింగ్‌గా మారిపోతాడ‌ని చెప్పాలి. అంతేకాదు.. వైద్య వ్య‌వ‌స్థ‌లోనూ ఇది అనూహ్య‌మైన మార్పులు తీసుకువ‌చ్చే అవ‌కాశ‌ముంది. మ‌రి విప్ల‌వాత్మ‌క‌మైన ఈ సాంకేతిక‌త అందుబాటులోకి వ‌స్తే మాన‌వ జీవితం ఎలాంటి మార్పుల‌కు లోన‌వుతుందో చూడాల్సిందే. అసలు ఈ ఆలోచ‌న వ‌చ్చిన ఎలాన్ మ‌స్కే అద్భుత‌మైన ఓ ఏలియ‌న్‌లా అనిపించ‌డం లేదూ..!

మరింత సమాచారం తెలుసుకోండి: