గుడివాడ క్యాసినో.. వారం రోజులుగా టీడీపీ ఫోకస్ చేస్తున్న అంశం ఇది. గుడివాడలో సంక్రాంతి పండుగ సందర్భంగా క్యాసినో జరిగిందన్నది టీడీపీ ఆరోపణ.. అసలు క్యాసినో అంటే ఏంటి.. అక్కడ ఏంచేస్తారు.. క్యాసినో అంటే.. జూదశాల తరహాలో విచ్చలవిడిగా జూదం ఆడతారు.. క్యాబరే డ్యాన్సులు చేస్తారు.. ఈ తరహా వినోదం, జూదం విదేశాల్లో ఉంటాయి. మన దగ్గర ఆ సంస్కృతి లేదు. అయితే.. సంక్రాంతి సంబరాల్లో భాగంగా కోడి పందేలు, కోడి పందేల శిబిరాల వద్ద జూదం అనేది కొత్తమీ కాదు.. ఎప్పుడూ జరగనిదేమీ కాదు.


మరి టీడీపీ ఈ ఇష్యూని ఎందుకు అంత హైలెట్‌ చేస్తోంది.. దీనికి కారణం ఉంది. ఈసారి క్యాసినో జరిగింది అని చెబుతున్న ప్రాంతం ఏకంగా మంత్రి కొడాలి నాని సొంత కల్యాణ మండపం అనేది టీడీపీ ఆరోపణ. దీనికితోడు.. క్యాసినో జరిగినట్టు వీడియోలను టీడీపీ బయటపెట్టింది. దీనిపై మంత్రి నాని వివరణ ఇచ్చారు.  క్యాసినో తన కల్యాణ మండపంలో జరగలేదని.. ఆ మండపానికి సమీపంలో జరిగిందని.. దానికి తనకు బాధ్యత లేదని ప్రకటించారు. అయితే నేరుగా మంత్రి పేరు రావడంతో టీడీపీ కాస్త హడావిడి చేసింది. అందులో తప్పుబట్టాల్సింది ఏమీ లేదు.


అయితే.. టీడీపీ ఇదే అంశాన్ని హైలెట్‌ చేస్తూ దాదాపు వారం రోజులుగా కథ నడిపిస్తోంది. దీనిపై నిజనిర్థరణ కమిటీని వేయడం.. వారు గుడివాడ వెళ్లడం.. అక్కడ పోలీసులు అడ్డుకోవడం.. టీడీపీ నేతల వాహనాలను ధ్వంసం చేయడం.. ఈ హంగామా సాగింది.  ఈ అంశంలో మంత్రి కొడాలి నాని తప్పించుకుందామని ప్రయత్నిస్తున్నా.. ఆయన సొంత ఊళ్లో.. ఆయన పాటలు పెట్టుకుని.. ఆయన పార్టీ జెండాల రంగులతో క్యాసినోను అలంకరించి నిర్వహించిన జూదానికి ఆయనకూ బాధ్యత ఉంటుంది.


కానీ.. ఈ ఇష్యూని వారం రోజులుగా హైలెట్‌ చేయడం వల్ల.. ఇతర అంశాలు పక్కదారి పట్టిపోయాయి..పోనీ.. దీని వల్ల జనంలో పెద్దగా పేరు వస్తుందా అంటే అదీ కష్టమే.. సంక్రాంతి సంబరాల్లో ఇలాంటి జూదాలు పెద్ద విషయంగా జనం పట్టించుకునే అవకాశం కనిపించడం లేదు.  టీడీపీ జనం సమస్యలపై ఈ స్థాయిలో పోరాడితే ప్రయోజనం ఉంటుందేమో.

మరింత సమాచారం తెలుసుకోండి: