ఆంధ్రప్రదేశ్‌.. తెలుగు నేల.. తెలుగు మాట్లాడే ప్రజల ప్రాంతం.. 1956 నుంచి 2014 వరకూ దాదాపు ఆరు దశాబ్దాలు ఒకే రాష్ట్రంగా ఉన్న ప్రాంతం.. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 23 జిల్లాలు ఉండేవి.. అప్పట్లో జిల్లాలా జాబితాలో శ్రీకాకుళం నుంచి మొదలై.. అనంతపురంతో ముగిసేది.. అంటే ఆనాడు 23 జిల్లాల తెలుగు నేల అన్నమాట. ఆంధ్ర జిల్లాలు 13 కాగా.. తెలంగాణ జిల్లాలు 10.  అలాంటిది రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రాల స్వరూపం మారిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని తెలంగాణ వజ్రాకారంలో వేరైపోతే.. వీణ ఆకారంలో ఆంధ్రప్రదేశ్‌ మిగిలిపోయింది.


తెలంగాణ వచ్చిన తర్వాత ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ కొత్త స్వప్నానికి తెర తీశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కాలం నుంచి మన జిల్లాలు చాలా పెద్దవని.. దేశంలోని అనేక రాష్ట్రాలతో పోలిస్తే మన జిల్లాలు చాలా పెద్దవని.. వాటిని విభజించాలని ఆలోచించారు. అలా చేయడం వల్ల పరిపాలన సామాన్యుడి చెంతకు చేరడమే కాకుండా... కేంద్రం నుంచి వచ్చే నిధుల విషయంలోనూ ఎక్కువ రాబట్టుకోవచ్చని ఆలోచించారు. కేంద్రం ఇప్పటికే అనేక నిధులను జిల్లాల వారీగా కేటాయిస్తుంటుంది. మనవి పెద్ద జిల్లాలు కావడం వల్ల అన్యాయం జరుగుతుందని భావించారు.


అలా కేసీఆర్ తెలంగాణను మొదట 31 జిల్లాలుగానూ.. ఆ తర్వాత 33 జిల్లాలుగానూ రూపొందించారు. అంటే 10 జిల్లాల తెలంగాణ ఇప్పుడు 33 జిల్లాల తెలంగాణ అయ్యిందన్నమాట. అలా ప్రతి జిల్లాకు ఓ కలెక్టరేట్‌, ఎస్పీ ఆఫీసు వంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. అప్పటి నుంచి  ఏపీలో కొత్త జిల్లాల చర్చ జరుగుతూనే ఉంది. కేవలం 10 జిల్లాల తెలంగాణ 33 జిల్లాలు అయితే.. 13 జిల్లాల ఆంధ్రా ఇంకెన్ని జిల్లాలవుతుందో అన్న విశ్లేషణలు సాగేవి. అయితే.. మరీ తెలంగాణ తరహాలో చిన్న జిల్లాలుగా చేయడం కంటే.. పార్లమెంటు నియోజక వర్గాన్ని జిల్లాగా మారిస్తే బావుంటుందన్న ఆలోచన కూడా వచ్చింది.


ఇప్పుడు అది కార్యరూపం దాల్చింది. ఏపీలోని 25 పార్లమెంటు స్థానాలు 25 జిల్లాలు కాగా.. ఒక్క అరకు పార్లమెంటరీ ప్రాంతం మాత్రం రెండు జిల్లాలైంది. అలా మొత్తం 26 జిల్లాలు ఏర్పాటయ్యాయి. ఇప్పుడు తెలుగు నేల..  అక్షరాలా 59 జిల్లాల నేల.. 33 తెలంగాణ, 25 సీమాంధ్ర జిల్లాల నేలగా రూపం మార్చుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: