రాష్ట్ర ప్ర‌భుత్వంలో స‌ర్కారుకు స‌ల‌హాదారులుగా ఎంద‌రో ఉన్నారు. సుమారు 32 మంది ఉన్న‌ట్టు తెలుస్తోంది. అయితే.. వీరెవ‌రూ కూడా పెద్ద‌గా మ‌న‌కు క‌నిపించ‌రు. కానీ, ముఖ్య‌మంత్రి స‌ల‌హాదారుగా ఉన్న స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మాత్రం స‌క‌లం.. స‌ర్వం.. అనే రీతిలో ప్ర‌తి విష‌యంలోనూ క‌నిపిస్తున్నార‌నే వాద‌న ఉంది. ప్ర‌భుత్వం ఏ నిర్ణ‌యం తీసుకున్నా.. వివాదం ఎలాంటిది వ‌చ్చినా.. ప్ర‌త్య‌ర్థుల నుంచి ఎలాంటి విమ‌ర్శ‌లు ఎదురైనా.. కూడా స‌జ్జ‌ల ముందుంటారు. ఇటు స‌ర్కారును కాపాడుతూ.. అటు ప్ర‌త్య‌ర్థుల మాట‌ల తూటాల కు త‌న‌దైన శైలిలో సమాధానం చెబుతుంటారు.

రాష్ట్రంలో వైసీపీ స‌ర్కారు ఏర్ప‌డిన త‌ర్వాత‌.. తొలి ఆరు మాసాల‌పాటు స‌జ్జ‌ల తెర‌మీదికి రాలేదు. అయి తే..ఈ స‌మ‌యంలో ప్ర‌తిప‌క్షాల నుంచి వ‌చ్చిన విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొనేందుకు.. వారికి స‌రైన విధంగా స‌మా ధానం చెప్పేందుకు మంత్రులు పెద్ద‌గా జోక్యం చేసుకోలేక పోయారు. అది వారికి పెద్ద మైన‌స్‌గా మారిపో యింది. పైగా అప్పుడే ఏర్ప‌డిన ప్ర‌భుత్వం.. ఎన్నిక‌ల వేడి ఇంకా చ‌ల్లార‌లేదు. ఈ క్ర‌మంలో ఇప్పుడే ఎందు కు స్పందించాల‌ని అనుకున్నారో.. ఏమో.. తెలియ‌దు కానీ.. విప‌క్షాల‌కు ఆయుధాలు అందించేసిన‌ట్టుగా వ్య‌వ‌హ‌రించారు. దీంతో స‌ర్కారు త‌ర‌ఫున స‌మాధానం చెప్పేవారు క‌నిపించ‌కుండా పోయారు.

ఇలాంటి కీల‌క స‌మ‌యంలో రంగంలోకి వ‌చ్చిన స‌జ్జ‌ల‌.. ప్ర‌భుత్వం త‌ర‌ఫున గ‌ట్టి వాయిస్ వినిపించ‌డం ప్రారంభించారు. శాఖ ఏదైనా.. స‌మస్య ఎలాంటిదైనా.. అది పొరుగు రాష్ట్రం నుంచి వ‌చ్చినా.. మ‌న రాష్ట్రంలోనే పుట్టినా.. ఆయ‌న స్పందించ‌డం ప్రారంభించారు. ప్ర‌తిప‌క్షాల‌కు త‌గిన విధంగా స‌మాధానం చెప్ప‌డం ప్రారంభించారు. దీంతో స‌జ్జ‌ల వాయిస్ కూడా అంద‌రూ ఆహ్వానించే విధంగా ఉండ‌డం.. విమ‌ర్శ‌ల‌కు కూడా త‌న‌దైన శైలిలో భాష్యం చెప్పడం వంటివి అంద‌రినీ ఆక‌ట్టుకున్నాయి. దీంతో స‌జ్జ‌లే అన్నింటా ముందు ఉండేలా వ్య‌వ‌హారం మారిపోయింది.

ఇక‌, మంత్రులు కూడా వెన‌క్కి త‌గ్గిపోయే ప‌రిస్థితి వ‌చ్చింది. ఇది వారి స్వ‌యంకృత‌మే అని చెప్పాలి. కొన్నాళ్ల కింద‌ట సీఎం జ‌గ‌న్ సోద‌రి ష‌ర్మిల తెలంగాణ‌లో పార్టీ పెట్టిన‌ప్పుడు తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అయితే.. దీనిని తిప్పికొడుతూ.. స‌జ్జ‌ల చేసిన కామెంట్స్ హైలెట్ అయ్యాయి. అదేవిధంగా ఇరు తెలుగు రాష్ట్రాల మ‌ద్య వివాదాలు వ‌చ్చిన‌ప్పుడు కూడా ఆయ‌న స్పందించారు. ఇక‌, ఇప్పుడు ఉద్యోగుల స‌మ‌స్య వ‌చ్చిన‌ప్పుడు కూడా ఆచితూచి వ్య‌వ‌హ‌రించ‌డం.. ఉద్యోగులు కూడా ప్ర‌భుత్వంలో భాగ‌మేన‌ని ప్ర‌క‌టించ డం ద్వారా.. వారిని శాంతింప‌జేసే ప్ర‌య‌త్నం చేయ‌డం వంటివి స‌జ్జ‌ల ప‌నికి తార్కాణంగా నిలుస్తున్నా య‌న‌డంలో సందేహం లేదు.

అయితే.. ఈ క్ర‌మంలో మంత్రుల‌ను డ‌మ్మీ చేస్తున్నార‌నే వాద‌నలో ప‌స‌లేదు. ఇదే నిజ‌మైతే.. కొడాలి నాని, పేర్ని నాని, సీదిరి అప్ప‌ల‌రాజు, బాలినేని శ్రీనివాస‌రెడ్డి వంటి వారు.. మీడియాతో బాగానే మాట్లాడుతున్నారు. మ‌రి దీనిని బ‌ట్టి స‌జ్జ‌ల ఎవ‌రికీ అడ్డుకార‌నే విష‌యం స్ప‌ష్టంగా తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: