కేసీఆర్ ఇవాళ ముంబై వెళ్తున్నారు.. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ థాక్రేతో ఆయన సమావేశం కానున్నారు. సీఎం కేసీఆర్ టూర్ షెడ్యూల్ ఖరారైంది. ఆయన ఈ ఉదయం పదిన్నర సమయంలో బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ముంబయి వెళ్తారు. అక్కడ కొద్దిసేపు హోటల్‌లో బస చేస్తారు.. మధ్యాహ్నం ఒకటిన్నర ప్రాంతంలో మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ థాక్రేను ఆయన నివాసంలో కలుసుకుంటారు. వీరిద్దరూ ప్రత్యేకంగా సమావేశం అవుతారు.  


మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ థాక్రేతో భేటీ తర్వాత.. కేసీఆర్‌ ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌తోనూ సమావేశం కానున్నట్టు తెలిసింది. వీరిద్దరితో భేటీ తర్వాత రాత్రికి మళ్లీ కేసీఆర్ తిరుగు ప్రయాణం అవుతారు. రాత్రి 10.30 ప్రాంతంలో మళ్లీ ఆయన బేగంపేట చేరుకుంటారని షెడ్యూల్‌ చెబుతోంది. అయితే.. కేసీఆర్ముంబయి యాత్రకు చాలా ప్రత్యేకత ఉంది. ప్రధాని మోడీని ధైర్యంగా ఎదిరిస్తూ.. ఆయన వ్యతిరేకులందరినీ కూడగడుతున్న సమయంలో ఈ భేటీ జరుగుతుండటం ప్రత్యేకత సంతరించుకుంది.


ఇప్పటికే ప్రధానికి వ్యతిరేకంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బాగానే గళం విప్పుతున్నారు. ఇప్పుడు కేసీఆర్ గళం ఆమెకు జోడయ్యింది. వీరిద్దరి స్థాయిలో కాకపోయినా.. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ థాక్రే అటు తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా అప్పుడప్పుడు మోడీకి వ్యతిరేకంగా స్వరం సవరించుకుంటూనే ఉన్నారు. ఇలాంటి సమయంలో సెక్యులర్ శక్తులన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందంటూ కేసీఆర్‌ ఈ యాత్రలు ప్రారంభించారు.


అయితే.. ఈ యాత్రల ఫలితం ఎలా ఉంటుందన్నది మాత్రం ఇప్పుడే చెప్పలేం.. గతంలోనూ కేసీఆర్ ఇలాంటి థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాలు చేపట్టి ఆ తర్వాత ఆ ఆలోచన విరమించుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం కాస్త గట్టిగానే మోడీ వ్యతిరేక కూటమి ప్రయత్నాలు చేస్తున్నారు. అంతే కాదు.. రాజకీయ చాణక్యుడిగా పేరున్న ప్రశాంత్ కిషోర్ సలహాలు తీసుకుంటున్నారు. మరి ఇప్పుడు ఈ కొత్త యాత్రలు సత్ఫలితాలు ఇస్తాయా.. కేసీఆర్ మోడీని ఢీకొట్టగలుగుతారా.. చూడాలి.. ఏం జరుగుతుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి: