వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు.. ఈ ప్రశ్న వేస్తే..ఇదేం ప్రశ్న ఆయనకు తన సొంత స్థానం గజ్వేల్ ఉంది కదా అనుకుంటారు ఎవరైనా.. అవును.. ఆయన గజ్వేల్‌ నుంచి భారీ మెజార్టీతోనే గెలుస్తున్నారు. అంతకుముందు కేసీఆర్ తన సొంత జిల్లా సిద్ధిపేట నుంచి పోటీ చేసేవారు.. ఇక ఎంపీగా గతంలో ఆయన కరీంనగర్‌ నుంచి పోటీ చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకు వ్యూహం మార్చి పార్టీకి అంతగా పట్టులేని పాలమూరు ఎంపీ సీటు నుంచి కూడా పోటీ చేసి గెలిచారు.


కేసీఆర్ స్వయంగా తెలంగాణలో ఎక్కడి పోటీ చేసినా గెలుస్తారని టీఆర్ఎస్ నమ్మకం.. అందుకే ఆయన ఈసారి గజ్వేల్‌ నుంచి కాకుండా ఏదైనా కొత్త సీటును నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరి అది ఎక్కడ అయి ఉంటుంది.. గతంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో టీఆర్ఎస్‌కు పెద్దగా పట్టు లేదు.. కానీ ఇప్పుడు సీన్ మారింది. అందుకే ఈసారి కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ ఈ రాజధాని జిల్లాల్లో పోటీ చేయబోతున్నట్టు కూడా ప్రచారం  జరిగింది. కేసీఆర్ మేడ్చల్‌ నుంచి పోటీ చేయవచ్చని కూడా ప్రచారం జరిగింది.


అయితే.. కేసీఆర్ వ్యూహం మాత్రం వేరేగా ఉందంటున్నారు కొందరు పార్టీ నేతలు. పార్టీ బలహీనంగా ఉన్న చోట ఆయన బరిలో దిగితే.. ఆ ప్రాంతం మొత్తానికి ఊపు వస్తుందని.. అది పార్టీకి ప్లస్ అవుతుందన్నది కేసీఆర్ వ్యూహంగా చెబుతున్నారు. కేసీఆర్ గతంలో ఇలాంటి వ్యూహాలు విజయవంతంగా రచించి, విజయం సాధించిన దృష్ట్యా మరోసారి అదే ప్లాన్ వేస్తారని చెబుతున్నారు.


అందులో భాగంగానే పార్టీకి పెద్దగా పట్టులేని నల్గొండ జిల్లా నుంచి ఈసారి కేసీఆర్ బరిలో దిగుతారని ఓ ప్రచారం సాగుతోంది. అందుకు ఆయన మునుగోడు నియోజకవర్గాన్ని ఎన్నుకున్నట్టు కూడా చెబుతున్నారు. ఇది కోమటిరెడ్డి సోదరుల కంచుకోట. ఇక్కడ కేసీఆర్ బరిలో దిగితే రాజకీయం యమా రంజుగా ఉంటుంది. నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్‌కు ఊపు కూడా వస్తుంది. మరి ఈసారి కేసీఆర్ పోటీ చేసేది మునుగోడు నుంచేనా కాదా అన్నది కొంతకాలం ఆగితే కానీ తెలియదు. చూద్దాం.. ఏం జరుగుతుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి: