డబుల్ ఇంజిన్‌.. ఇటీవల బీజేపీ నేతలు తరచు వాడుతున్న పదం ఇది. ఈ డబుల్ ఇంజిన్ అంటే ఏంటి.. దీని అర్థం కేంద్రం, రాష్ట్రం రెండు చోట్లా బీజేపీయే అధికారంలో ఉండటం.. అలా ఉండటం వల్ల ఆ రాష్ట్రాల్లో అభివృద్ధి పరుగులు పెట్టిస్తామని బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు. కేంద్రంలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకుని రాష్ట్రాల్లోనూ తనకు అధికారం ఇవ్వాలని ఓటర్లను కోరుతోంది. ఇప్పటికే కేంద్రంలో అధికారంలో ఉండటం వల్ల.. రాష్ట్రంలోనూ అధికారం ఇస్తే.. డబుల్ ఇంజిన్లతో పరుగులు పెట్టిస్తామన్నది వారి ఉద్దేశ్యం.


ఏదైనా యంత్రం ఇంజిన్‌తో నడుస్తుంది.. మరి ఒకే యంత్రానికి రెండు ఇంజిన్లు ఉంటే.. అనే కాన్సెప్టుతో ఈ పదాన్ని సృష్టించాయి కాషాయ దళాలు.. తమకు రాష్ట్రాల్లో అధికారం ఇస్తే రెండింతల అభివృద్ది చేసి చూపిస్తామన్నది వారి హామీ.. ఈ డబుల్ ఇంజిన్ నినాదాన్ని యూపీ ఎన్నికల్లో బాగా వాడింది బీజేపీ.. అక్కడ అధి ఫలించింది కూడా. ఇప్పుడు విపక్షాలు కూడా దీన్నే విమర్శన అస్త్రంగా మలచుకుంటున్నాయి.


ఇటీవల బీజేపీ అంటనే మండిపడుతున్న టీఆర్ఎస్‌ నేతలు కూడా ఈ అంశంపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్‌లో విద్యుత్ కోతలు పెరగడాన్ని తెలంగణ మంత్రి కేటీఆర్‌ రాజకీయ విమర్శగా మలచుకున్నారు. గుజరాత్‌లో విద్యుత్‌ కోతలపై సోషల్ మీడియా వేదికగా తెలంగాణ మంత్రి కేటీఆర్‌ విమర్శలు గుప్పించారు. గుజరాత్‌లో పరిశ్రమలకు పవర్‌ హాలీడే ప్రకటించారని.. బలమైన వ్యక్తులు వచ్చిన గుజరాత్‌లోనే పవర్ హాలిడే ప్రకటించారని గుర్తు చేశారు. మరి గుజరాత్‌లో ఉన్నది డబుల్‌ ఇంజినా లేక ట్రబుల్‌ ఇంజినా అని ఆయన ప్రశ్నించారు.


తెలంగాణ బీజేపీ నాయకులు కూడా తరుచుగా ఈ డబుల్ ఇంజిన్ నినాదం వినిపిస్తుంటారు. అందుకే కేటీఆర్గుజరాత్ విద్యుత్ కోతల అంశంపై ఎదురు దాడి ప్రారంభించారు. ఇదేనా డబుల్ ఇంజిన్ అభివృద్ధి అని నిలదీశారు. పాపం..బండి సంజయ్ లాంటి బీజేపీ నేతలు దీన్ని ఎలా తిప్పి కొడతారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: