ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యాను కట్టడి చేయలేకపోతున్న అమెరికా ఆ కోపం ఇండియాపై చూపిస్తోంది. రష్యా చేస్తున్న యుద్ధాన్ని ఇండియా ఖండించకపోవడం.. రష్యాపై ఆంక్షలు విధించకపోవడం.. పైగా రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవడం.. ఐక్యరాజ్య సమితిలో రష్యాకు వ్యతిరేకంగా ఓటేయకపోవడం వంటి చర్యలతో ఇండియా అంటేనే ఇప్పుడు అమెరికా మండిపడుతోంది. అయితే రష్యాకు ఇండియా దోస్తీ ఈనాటిది కాదు.. నెహ్రూ కాలం నుంచి రష్యా మనకు నిజమైన ఆప్తుడుగా ఉంది. అందుకే ఇండియా రష్యాపై చర్యల విషయంలో ఆచి తూచి స్పందిస్తోంది.


కానీ రష్యా యుద్ధంపై ఇండియా వైఖరి అమెరికాకు కోపం తెప్పిస్తోంది. అందుకే బ్లాక్‌ మెయిల్ చేయడం కూడా ప్రారంభిస్తోంది. ఓవైపు రష్యా విదేశీ వ్యవహారాల మంత్రి సెర్గీ లవ్రోవ్‌ ఇండియాలో పర్యటిస్తున్నారు. దీంతో అమెరికాకు మరింతగా మండిపోతోంది. అందుకే అమెరికా భారత్‌కు తీవ్రస్థాయిలో వార్నింగ్ ఇస్తోంది. అగ్రరాజ్యం నుంచి వచ్చిన ఆ దేశ ఉప జాతీయ భద్రతా సలహాదారుడు దలీప్‌ సింగ్‌ గత రెండు రోజులుగా భారత అధికారులతో చర్చలు జరుపుతున్నారు.


భారత్‌ రష్యా పట్ల అనుసరిస్తున్న వైఖరిపై ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఉక్రెయిన్‌ సంక్షోభంలో భారత్‌ పోషించిన పాత్రను తీవ్రంగా విమర్శిస్తున్నారు. యుద్ధం సాగుతున్న వేళ.. రష్యా నుంచి భారత్‌ చౌకగా చమురు దిగుమతి చేసుకోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. భారత్ చేసుకున్న ఈ దిగుమతులు అమెరికా రష్యాపై విధించిన ఆంక్షల పరిధిలోకి రానే రావు..


ఆ విషయాన్ని అమెరికా ఒప్పుకుంటూనే రష్యా చమురుపై భారత్‌ చూపిస్తున్న ఉత్సాహాన్ని తగ్గించుకోవాలంటోంది. ఇదే సమయంలో భవిష్యత్‌లో ఇండియాపై చైనా దాడి చేస్తే రష్యా మిమ్మల్ని ఆదుకుంటుందనుకుంటున్నారా అని అమెరికా ప్రశ్నిస్తోంది. రష్యాపై చైనా పట్టు సాధిస్తే అది భారత్‌కు చాలా నష్టం కలిగిస్తుందని గుర్తించాలని అమెరికా హెచ్చరిస్తోంది. ఈ వ్యాఖ్యలపై ఇండియా మాత్రం ఇంకా స్పందించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: