ఇంధన ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా మళ్లీ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రోజూ పెరుగుతున్నాయి. ఒక్క రోజు కూడా గ్యాప్ ఇవ్వకండా మోడీ సర్కారు బాదేస్తోంది. హైదరాబాద్‌లోనే లీటర్ పెట్రోల్ రూ.120, డీజిల్ రూ.106 రూపాయలకు చేరుకుంది. ఈ రేట్లు తెలుగు రాష్ట్రాల్లో ఏ మూలకు వెళ్లినా ఇంకా ఎక్కువగానే ఉంటున్నాయి. వరుసగా పెరుగుతున్న ఇంధన ధరలతో సామాన్యుడు విలవిలలాడుతున్నాడు.

 
పెరిగిన ఇంధన ధరల పెరుగుదలతో అన్ని వర్గాల జనం కుదేలవుతున్నారు. వీరు వారు అని కాదు.. ఈ ఇంధన ధరల ప్రభావానికి లోను కాని రంగమే కనిపించడం లేదు. ఇక క్యాబ్‌, ఆటోవాలాలు బెంబేలెత్తుతున్నారు. నిన్నటి వరకు కరోనా కాటుతో విలవిల్లాడిన వీరు.. ఇప్పుడు కాస్త కరోనా కంట్రోల్ అయ్యిందంటే.. ఇప్పుడు పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో అవస్థలు పడుతున్నారు. చివరకు కొందరైతే వాహనాలు అమ్మి ఇతర వృత్తుల్లోకి వెళ్లిపోతున్నారు. క్యాబ్‌, ఆటోవాలాలకు నిత్యావసర ధరలు భారంగా మారిపోయాయి.


ఇక వ్యవసాయ రంగంపైనా ఇంధన ధరల ప్రభావం గణనీయంగానే ఉంటోంది. పెరిగిన ఇంధన ధరలతో సాగు  మరింత కష్టంగా మారుతోంది. వానాకాలం సీజన్ నాటికి సాగు ఖర్చులు అధికమవుతాయని రైతుల ఆందోళన చెందుతున్నారు. పంటలపై వచ్చే కొద్దిపాటి రాబడీ హరించుకుపోతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇక పారిశ్రామిక రంగంపైనా ఇంధన ధరలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

 
ఎక్కడికక్కడ రవాణా ఛార్జీలు పెరగడంతో ముడి పదార్థాల ధరలు రెట్టింపవుతున్నాయి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మూతపడే ప్రమాదం పొంచి ఉంది. ఇంధన ధరలతో మార్కెట్‌లో అన్ని వస్తువుల రేట్లు పెరుగుతున్నాయి. తయారీ వ్యయంతో పాటు రవాణా వ్యయం కూడా పెరిగిపోడంతో అన్నింటి రేట్లు పెరుగుతున్నాయి. ఇదే అదనుగా వ్యాపారులు అన్నింటి రేట్లు పెంచేసి.. ఇంధన ధరలను సాకుగా చూపుతున్నారు. మోడీ సర్కారు ఇలా జనంపై మోదుకుంటూ పోతే.. ఇక బతికేదెట్లా అని అన్ని వర్గాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: