నగరి ఎమ్మెల్యే రోజా ఎట్టకేలకు మంత్రి అయ్యారు. గత కేబినెట్‌లోనే అవకాశం వస్తుందని చూసినా.. నిరాశ పడిన రోజాకు ఈసారి మాత్రం అవకాశం దక్కింది. ఎట్టకేలకు ఆమె చిరకాల వాంఛ నెరవేరింది. అయితే.. మంత్రి అయిన కారణంగా ఆమెకు ఎంతో పేరు తెచ్చిన టీవీ కార్యక్రమాలకు సైతం దూరం కావాలని రోజా నిర్ణయించుకున్నారు. మంత్రి అయినందుకు ఇకపై షూటింగ్‌లు మానేస్తున్నానని ఆమె స్వయంగా ప్రకటించారు.. టీవీ, సినిమా షూటింగ్‌లలో ఇక ముందు  చెయ్యనని నగిరి ఎమ్మల్యే రోజా తెలిపారు.


తనను మంత్రిగా ఎంపిక చేసిన జగనన్నతోనే ప్రాణం ఉన్నంతవరకు ఉంటానని, ఆయన కోసమే పనిచేస్తానని మంత్రి ఆర్కే రోజా అంటున్నారు. కొత్త మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్న తర్వాత ఆమె మాట్లాడారు. జగన్ ఇచ్చిన గుర్తింపు ఎప్పటికి మర్చిపోలేనని.. తనను అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వనని చంద్రబాబు అన్నారని.. గుర్తు చేసుకున్నారు. కానీ జగన్ అన్న తనను  రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఇప్పుడు మంత్రిగా అవకాశం ఇచ్చారని ఇందుకు ఆయనకు ప్రాణం ఉన్నంత వరకూ రుణపడి ఉంటానని రోజా ఆనందంగా చెప్పారు.


మహిళ పక్షపాత సీఎం క్యాబినెట్‌లో మహిళ మంత్రిగా చోటు దక్కడం తన అదృష్టం అంటున్నారు నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా.  సీఎం జగనన్న చెప్పిన పని చెయ్యడమే ఇక ముందు తన విధి అంటున్నారు. ఒకప్పుడు తనను ఐరన్ లెగ్ అని దుష్ప్రచారం చేశారని.. . కానీ ఈరోజు జగనన్న తనను మంత్రిగా చేశారని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. తన ప్రాణం ఉన్నంత వరకు జగనన్న కోసం పని చేస్తానని హామీ ఇస్తున్నానని రోజా అన్నారు.


వాస్తవానికి రోజాకు మంత్రి పదవి ఎప్పుడో రావాల్సింది కానీ.. ఆమె సామాజిక వర్గమే ఆమెకు అడ్డంకి అయ్యింది. జగన్ హయాంలో రెడ్లు చాలా మంది ఉన్నారు. అందరూ బలమైన నేతలే. కానీ సామాజిక వర్గ సమీకరణాల దృష్ట్యా కొందరికే అవకాశం ఇవ్వాల్సి ఉంది. అందులోనూ ఆమె జిల్లాలో పెద్ది రెడ్డి వంటి బలమైన నేత ఉన్నారు. అయితే.. ఎలాగైనా రోజాకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని నిర్ణయించుకున్న జగన్.. చిత్తూరు జిల్లాలో ఏకంగా ముగ్గురికి మంత్రులుగా అవకాశం ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: