పాకిస్తాన్ కొత్త ప్రధానిగా షెహబాజ్‌ షరీఫ్‌ బాధ్యతలు తీసుకున్న తొలి రోజుల్లోనే ఇండియాకు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఆరంభంలోనే వివాదాస్పద అంశాలను ప్రస్తావిస్తూ ఇండియాకు వార్నింగ్ ఇస్తున్నాడు పాక్‌ కొత్త ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌. రెండు దేశాల మధ్య ప్రధాన సమస్యగా ఉన్న కాశ్మీర్ అంశాన్ని తొలి ప్రసంగంలోనే ప్రస్తావించడం ద్వారా..తన అభిమతం ఏంటో చెప్పకనే చెప్పేశాడు షెహబాజ్‌ షరీఫ్‌.. కాశ్మీర్‌ లోయలో నెత్తురు పారుతోందని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన షెహబాజ్‌ షరీఫ్‌.. అక్కడి ప్రజలకి దౌత్యపరమైన, నైతిక మద్దతు అందిస్తామంటున్నారు.


ప్రధాని పీఠమెక్కిన తొలిరోజే షెహబాజ్‌ షరీఫ్‌ భారత్‌పై విషం చిమ్ముతూ మాట్లాడిన తీరును బట్టి చూస్తే.. ఈ ప్రధాని కూడా ఇండియాకు తలనొప్పిగా మారతారనే అనిపిస్తోంది. అంతే కాదు.. కాశ్మీర్‌ వివాదం పరిష్కారమైతే తప్ప భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడవని షెహబాజ్‌ షరీఫ్‌ అనడం చూస్తే.. ఆయన వ్యవహార శైలి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అలాగే.. చైనాతో తమ బంధం ఏ పరిస్థితుల్లోనూ చెక్కుచెదరబోదని చెప్పడం ద్వారా భారత్‌కు పరోక్షంగా మరో హెచ్చరిక చేసినట్టయింది.


అయితే.. ఇమ్రాన్ నిష్క్రమణ తర్వాత పాక్‌ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన షెహబాజ్‌ షరీఫ్‌కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలపడం.. ఆయన దానికి సానుకూలంగా స్పందించడం కాస్త శాంతి కాముకుల్లో ఆశలు రేపింది. భారత్‌ శాంతి, స్థిరత్వాలను కోరుకుంటోందని తన సందేశంలో పేర్కొన్న మోదీ.. ప్రాంతీయంగా ఉగ్రవాదానికి తావుండకూడదని మన అభిమతాన్ని తెలిపారు. అప్పుడే అభివృద్ధి సంబంధిత సవాళ్లపై మనం దృష్టిసారించగలం అంటూ పరోక్షంగా టెర్రరిజాన్ని అరికట్టాల్సిందేనని చెప్పారు మోదీ.


దీనిపై పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ స్పందిస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీ తనకు అభినందనలు తెలిపినందుకు ధన్యవాదాలు చెప్పారు. భారత్‌తో పాకిస్థాన్‌ శాంతిపూర్వక, సహకార సంబంధాలను కోరుకుంటున్నానని షెహబాజ్‌ షరీఫ్‌ చెప్పుకొచ్చారు. అలాగే జమ్మూకశ్మీర్‌ సహా అపరిష్కృత అంశాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడం అనివార్యం అని నొక్కి చెప్పడం ద్వారా  షెహబాజ్‌ షరీఫ్‌ తన బుద్ది మరోసారి చాటుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: