సరిహద్దుల్లో ఇండియా, చైనా మధ్య ఉద్రిక్తతల సంగతి తెలిసిందే. కొన్నిసార్లు గల్వాన్ వంటి ప్రాంతాల్లో సైనికుల మధ్య ఘర్షణలు కూడా జరిగాయి. అయితే.. ఆ తర్వాత కాస్త పరిస్థితి సద్దుమణిగినా.. రెండు దేశాల మధ్య ఇంకా నమ్మకం పూర్తిగా లేదు. ఎవరి జాగ్రత్తల్లో వాళ్లు ఉంటున్నారు. అటు చైనా ఎప్పుడైనా యుద్ధానికి సన్నద్ధం అంటూ తగిన చర్యలు తీసుకుంటోంది. తాజాగా ఇండియా సరిహద్దుల్లో చైనా చేస్తున్న బాగోతం ఒకటి వెలుగు చూసింది.


అదేంటంటే.. వాస్తవాధీన రేఖ వద్ద చైనా ఎప్పటి నుంచో వేగంగా నిర్మాణాలు చేపడుతున్న సంగతి తెలుసుకదా.. పాంగాంగ్ సరస్సుపై ఇప్పటికే చైనా అక్రమంగా వంతెన నిర్మిస్తోంది. ఇప్పుడు అది చాలదన్నట్టు ఎల్ ఏసీ వద్ద మూడు మొబైల్ టవర్లు ఇటీవల ఏర్పాటు చేసిందట. ఈ విషయాన్ని లద్ధాఖ్ లోని చుషూల్ కౌన్సిలర్ ఒకరు వెల్లడించారు. ఈ మొబైల్ టవర్లు భారత్ భూభాగానికి చాలా దగ్గరలో ఉన్నాయట. ఈ చైనా వైఖరి దేశానికి ఆందోళనకరం అంటున్నాడాయన.


ఆయన ఆవేదనలో అర్థం ఉంది కదా.  ఇండియాలో ఉనన్న తన నియోజకవర్గంలోని 11 గ్రామాలకు ఇప్పటికీ 4జీ సౌకర్యం లేదని.. కానీ చైనా మాత్రం కొత్త టవర్లు వేసుకుంటోందని ఆయన ఆవేదన వెలిబుచ్చారు. అంటే సరిహద్దుల ప్రాంతాల్లో చైనా అన్ని విధాలు కనెక్టివిటీ పెంచుకుంటోంది. రోడ్లు వేస్తోంది.. వంతెనలు కడుతోంది. ట్రాన్స్‌ పోర్టు సౌకర్యాలు మెరుగుపరుచుకుంటోంది. ఇప్పుడు టెలి కమ్యూనికేషన్లు కూడా ఏర్పాటు చేసుకుంటోందన్నమాట.


అయితే.. పాంగాంగ్ వద్ద చైనా వంతెన నిర్మిస్తున్న ప్రాంతం 1962 నుంచి చైనా ఆక్రమణలోనే ఉందని మన ప్రభుత్వమే చెబుతోంది. ఈ విషయాన్ని ఈ ఏడాది ఫిబ్రవరిలో విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్ స్వయంగా పార్లమెంట్ లోనే చెప్పారు. ఇక  2020 మే నెలలో భారత్ -చైనా మధ్య తూర్పు లద్ధాఖ్ లో ఘర్షణలు మొదలై చినికి చినికి గాలివానగా మారాయి. అయితే.. గల్వాన్ ఘటన తర్వాత భారత్ -చైనా సైనిక కమాండర్ల స్థాయిలో ఇప్పటి వరకూ 15 సార్లు చర్చలు జరిగాయి. కానీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: