భారత దేశం ప్రపంచాన్ని మోసం చేస్తోందా.. ఓ విషయంలో నిజాలు దాచి పెట్టి ప్రపంచాన్ని తప్పుదోవ పట్టిస్తోందా.. అబద్దాలతో అందరి కళ్లు కప్పేస్తోందా.. అంటే.. అవును అంటున్నారు. ఇలా అవును అంటున్నది ఎవరో కాదు.. సాక్షాత్తూ కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ. మరి ఇంతకీ ఇండియా ఓ విషయంలో ప్రపంచాన్ని మోసం చేస్తోంది.. ఏ విషయంలో అబద్దాలు చెబుతోంది.. తెలుసా.. అది కరోనా విషయంలో అని రాహుల్ గాంధీ చెబుతున్నారు.


అవును..  కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కరోనాతో భారత్ లో 40లక్షల మంది ప్రాణాలు కోల్పోయారట. ఈ విషయాన్ని ఇప్పుడు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హైలెట్ చేస్తున్నారు. అందుకే..  కరోనా మృతుల కుటుంబాలకు 4లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఆ పని చేసైనా సరే.. ప్రధాని నరేంద్ర మోదీ తన బాధ్యతను నెరవేర్చుకోవాలని రాహుల్ గాంధీ మరోసారి డిమాండ్ చేస్తున్నారు. కొవిడ్ మరణాల సంఖ్యను వెల్లడించకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థను భారత్ అడ్డుకుంటోందట.


ఈ విషయాన్ని ఇటీవల న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఓ కథనంలో ప్రచురించింది. ఇప్పుడు రాహుల్ గాంధీ ఆ కథనాన్ని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు. దీంతో పాటు ప్రధాని మోదీ నిజాలు మాట్లాడరు, ఇతరులను మాట్లాడనివ్వరని రాహుల్ గాంధీ సెటైర్లు వేస్తున్నారు. ఆక్సిజన్ కొరత వల్ల ఎవరూ మరణించలేదని మోదీ ఇప్పటికీ అవాస్తవాలు చెబుతున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు.


ఇండియాపై కరోనా మరణాల విషయంలో గతంలోనూ విమర్శలు వచ్చాయి. కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఇండియాలో లక్షల మంది మృతి చెందారని.. కానీ ప్రభుత్వం ఆ మరణాల లెక్కలను దాచి పెట్టిందని అప్పట్లో అంతర్జాతీయ మీడియా గగ్గోలు పెట్టింది. కానీ.. ఇప్పుడు ఇండియా ప్రపంచ ఆరోగ్య సంస్థపైనా ఒత్తిడి చేసిందన్న విషయాన్ని న్యూయార్క్ టైమ్స్ కథనం వెల్లడించడం.. ఇప్పుడు దాన్ని రాహుల్ గాంధీ షేర్ చేయడం కొత్త చర్చకు ఆస్కారమిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: