ఏపీలో వైసీపీ, తెలంగాణలో టీఆర్ఎస్‌ అధికారంలో ఉన్నాయి. ఈ రెండు పార్టీలదీ విచిత్రమైన బంధం. ఏపీలో 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడు.. ఈ రెండు పార్టీల మధ్య మంచి మైత్రి ఉండేది. ఎందుకంటే.. ఈ రెండు పార్టీలకూ ఉమ్మడి శత్రువుగా చంద్రబాబు ఉండేవారు. చంద్రబాబు కు వ్యతిరేకంగా పోరాడటంలో జగన్‌కు కేసీఆర్ సహకరించాడన్న విమర్శలు కూడా ఉన్నాయి. దీనికితోడు.. అప్పట్లో కేసీఆర్‌ చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.


అటు చంద్రబాబు కూడా టీఆర్ఎస్‌, వైసీపీ, బీజేపీ కుమ్మక్కై టీడీపీ పై కుట్ర చేస్తున్నాయని తరచూ ఆరోపించేవారు. అయితే.. జగన్ అధికారంలోకి వచ్చాక సీన్ మారింది. జగన్ సీఎం అయిన  మొదట్లో వైసీపీ, టీఆర్ఎస్‌ సంబంధాలు భలే బావుండేవి. జగన్ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ రావడం, జగన్ కేసీఆర్ ఇంటికి వెళ్లడం, కాళేశ్వరరం ప్రారంభానికి జగన్ వెళ్లడం.. జల వివాదాలపై ఇరు రాష్ట్రాల సీఎంలు కూర్చొని మాట్లాడుకోవడం.. అంతా బాగానే ఉండేది. కానీ కేసీఆర్, జగన్‌లకు ఎక్కడో చెడింది. అప్పటి నుంచి ఎవరి దారి వారిదే అన్నట్టుగా ఉంది.


కానీ ఇటీవల టీఆర్ఎస్ నేతలు జగన్‌పై అప్పుడప్పుడు సీరియస్ కామెంట్లు చేస్తున్నారు. ప్రత్యేకించి విద్యుత్ విషయంలో జగన్ కేంద్రానికి లొంగిపోయారని కామెంట్ చేస్తున్నారు. తాజాగా హరీశ్ రావు కూడా అదే మాట అన్నారు. కేంద్రానికి ఏపీ సీఎం తలవంచారని.. రాష్ట్రాల మెడపై కేంద్రం విద్యుత్తు కత్తి పెట్టిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. జగన్‌ కేంద్రానికి తలవంచి శ్రీకాకుళం జిల్లాలో బోరు బావుల వద్ద మీటర్లు పెట్టారని హరీశ్‌రావు కామెంట్ చేశారు.


అదే తెలంగాణలో అయితే.. కేసీఆర్‌ మీటర్లు పెట్టేందుకు అంగీకరించలేదని.. అందుకే కేంద్రం తెలంగాణకు రూ.5 వేల కోట్లు కోత వేసిందని హరీశ్ కామెంట్ చేశారు. దీని వల్ల ఏపీకి మొత్తంగా రూ.7 వేల కోట్ల మేర ప్రయోజనం చేకూరుతుందన్నారు. కేంద్రం  విద్యుత్తు చట్టంలో సంస్కరణలు తేవాలంటూ రాష్ట్రాల మెడలపై కత్తి పెడుతోందని హరీశ్ రావు అన్నారు. ఏడేళ్లుగా టీఆర్‌ఎస్‌  ప్రభుత్వం 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తును వ్యవసాయానికి అందిస్తోందని గుర్తు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: