దేశంలో విద్యుత్ కొరత  పెరుగుతోంది. అనేక రాష్ట్రాలు విద్యుత్ కొరతతో అల్లాడుతున్నాయి. ఏపీ వంటి రాష్ట్రాల్లో దీని తీవ్రంగా మరింత ఎక్కువగా ఉంది. దేశంలో నెలకొన్న బొగ్గు సంక్షోభమే దీనికి కారణంగా చెబుతున్నారు. దేశంలో బొగ్గు సంక్షోభం రోజురోజుకూ తీవ్రతరమవుతోంది. పలు రాష్ట్రాల్లోన్ని విద్యుత్ ప్లాంట్ల వద్ద బొగ్గు నిల్వలు తగ్గాయి. దీంతో ఇప్పుడు మరింత వేగంగా బొగ్గు సరఫరా చేసేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది.


అయితే.. రాష్ట్రాలు వాడే బొగ్గులో పది శాతం కనీసం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని కేంద్రం రూల్ పెట్టింది. ఇది ఇప్పుడు రాష్ట్రాలకు ఇబ్బంది కరంగా మారింది. ఎందుకంటే విదేశీ బొగ్గు స్వదేశీ బొగ్గు కంటే అనేక రెట్లు ఖరీదైంది. అందుకే రాష్ట్రాలు ఈ నిబంధన పట్ల గుర్రుగా ఉన్నాయి. ఇక బొగ్గు రవాణా చేసే రైళ్ల రాకపోకలకు ఆటంకం కలగకుండా కేంద్రం సాధారణ రైళ్లను రద్దు చేస్తోంది. శుక్రవారం 42 ప్యాసింజర్ రైళ్లను నిరవధికంగా కేంద్రం రద్దు చేసింది.


తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఈ రైళ్ల రాకపోకలు నిలిచిపోనున్నట్లు  రైల్వే శాఖ అధికారులు తెలిపారు. మే నెలాఖరు వరకు 650కి పైగా ప్రయాణికుల రైళ్ల రాకపోకలను రద్దు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో ఎక్స్ ప్రెస్ రైళ్లతో పాటు మెయిల్ , కమ్యూటర్ ట్రైన్ లు ఉన్నాయట.  దేశీయ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో... ఏప్రిల్ ఆరంభం నుంచి ఇప్పటివరకు 17శాతం బొగ్గు నిల్వలు తగ్గాయని కేంద్ర అధికార వర్గాలు చెబుతున్నాయి.


దేశవ్యాప్తంగా 160 వరకూ ధర్మల్ విద్యుత్ ప్లాంటు ఉన్నాయి. ఈ పవర్ ప్లాంట్ల వద్ద నిబంధనల ప్రకారం కనీసం 21 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండాలి. కానీ ప్రస్తుతం చాలా చోట్ల ఒక రోజుకు మించి సరిపడా నిల్వలు లేవు. ఈ పరిస్థితి ఇప్పుడు దేశవ్యాప్తంగా చీకట్లకు కారణం అవుతోంది. ఇక ఇప్పుడు ఈ విద్యుత్ కొరత అంశం రాష్ట్రాల మధ్య కూడా కుంపట్లు పెడుతోంది. ఇటీవల కేటీఆర్ ఏపీలో కరెంట్ లేదని చేసిన వ్యాఖ్యలు రాజకీయ కలకలానికి దారి తీసిన సంగతి తెలిసిందే కదా.

మరింత సమాచారం తెలుసుకోండి: