సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మన తెలుగు వ్యక్తి జస్టిస్‌ నూతలపాటి వెంకట రమణ.. తన సత్తా చాటుతున్నారు. ఏదో మొక్కుబడిగా కాకుండా న్యాయవ్యవస్థపై తనదైన ముద్ర వేస్తున్నారు. ఆయన సీజేఐ అయినప్పటి నుంచి దూకుడుగా పని చేస్తూ.. న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నారు.  ఆయన చొరవ కారణంగా ఇప్పడు చాలా కాలం తర్వాత సుప్రీం కోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పూర్తి స్థాయికి చేరింది.


సీజేఐ ఎన్వీ రమణ ఇటీవల సుప్రీంకోర్టుకు మరో ఇద్దరిని న్యాయమూర్తులుగా నియమించారు. గువహటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుధాన్షు ధులియా, గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జమ్ షెడ్ బీ పర్దివాలాను నియమించారు. ఇటీవల వారిద్దరూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించారు. ఈ ఇద్దరితో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 34కు చేరింది. ఇదే సుప్రీం కోర్టులో పూర్తి స్థాయి న్యాయమూర్తుల సంఖ్య. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రమణ బాధ్యతలు స్వీకరించినప్పటి న్యాయశాఖల్లో ఖాలీల పూర్తిగా దృష్టి పెట్టారు.


ఆయన ఇప్పటివరకు సుప్రీంకోర్టు సహా దేశంలోని వేర్వేరు హైకోర్టుల్లో ఖాళీల భర్తీకి అత్యంత ప్రాధాన్యమిచ్చారు. జస్టిస్ రమణ నేతృత్వంలోని కొలీజియం ఇప్పటివరకు కొత్తగా 11మందితో సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణం చేయించారు. అంతే కాదు.. జస్టిస్‌ ఎన్‌ వీ రమణ సీజేఐ అయినప్పటి నుంచి న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న అనేక మౌలికమైన సమస్యల గురించి ఎప్పటి కప్పుడు కేంద్రానికి నివేదికలు పంపుతున్నారు. ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు.


ఇప్పటికే మన కోర్టుల వద్ద లక్షల కేసులు పెండింగులో ఉన్నాయి. తాము నేరం చేశామని రుజువు కాకపోయినా లక్షల మంది అండర్ ట్రయల్స్ జైల్లో మగ్గుతున్నారు. అందుకే న్యాయమూర్తుల నియామకంపై జస్టిస్ ఎన్‌ వీ రమణ అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. అలాగే కేంద్రంతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ కోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: