ఏపీలో ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. మాజీ మంత్రి నారాయణను ఏపీ పోలీసులు అరెస్టు చేయటంపై రాజకీయ దుమారం రేగుతోంది. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతపై దృష్టి మళ్లించేందుకే వైకాపా ప్రభుత్వం మళ్లింపు రాజకీయాలు చేస్తోందని తెలుగు దేశం నేతలు మండిపడుతున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇటీవల తొలిసారి జరిగిన పదో తరగతి పరీక్షల్లో వరుస వివాదాలు కలకలం సృష్టించాయి. గత నెల 27 నుంచి పదో తరగతి పరీక్షలు జరిగాయి.


తొలిరోజు నుంచే ప్రశ్నాపత్రాలు సామాజిక మాధ్యమాల్లో వచ్చేశాయి. ప్రశ్నాపత్రాలు లీక్‌ కాలేదని మొదట్లో మంత్రి బొత్స చెప్పారు. కానీ లీకేజీలు ఆగలేదు. ఆ తర్వాత లీకేజీల వెనుక తెలుగుదేశం వారున్నారంటూ ఇటీవల ముఖ్యమంత్రి ఆరోపించారు. తాజాగా నారాయణను అరెస్టు చేయటంతో ఈ వ్యవహారానికి రాజకీయ రంగు పులుముకుంది. ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో నారాయణ అరెస్టుపై తెలుగుదేశం మండిపడుతోంది.


పరీక్షల నిర్వహణలో విఫలమైన జగన్.. నారాయణను బూచిగా చూపి.. కప్పిపుచ్చుకునేందుకే ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తోంది తెలుగు దేశం. నారాయణను అరెస్టు చేసి ఆయనను దోషిగా చూపే ప్రయత్నం చేస్తోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు కూడా ధ్వజమెత్తారు. ముందస్తు నోటీసు ఇవ్వకుండా విచారణ చెయ్యకుండా, ఆధారాలు లేకుండా నేరుగా ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. ఈ విషయంలో నారా లోకేశ్ కూడా ఫైర్ అయ్యారు.


వైసీపీ వాళ్లు చేసిన నేరాలు, అక్రమాలను ఇతరులపైకి నెట్టడం జగన్ అండ్ కో ట్రేడ్ మార్క్‌గా మారిందని లోకేశ్ విమర్శించారు. అచ్చెన్నాయుడు ఊరుకుంటారా.. ఆయనా రెచ్చపోయారు. ప్రశ్నపత్రాల లీకేజీ జరగలేదని స్వయానా మంత్రి బొత్స చెబుతుంటే నారాయణను ఎలా అరెస్ట్ చేస్తారని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు వంటి నేతలు డిమాండ్ చేశారు. మొత్తం మీద జగన్.. నారాయణను టార్గెట్ చేశారని.. అందుకే కక్ష కట్టి అరెస్టు చేయించారని టీడీపీ నేతలు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: