వైవాహిక అత్యాచారం నేరమా? కాదా?  ఇదీ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు తెర తీసిన అంశం. తాజాగా ఈ అంశంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు చర్చనీయాంశం అయ్యింది. వైవాహిక అత్యాచారం నేరమా? కాదా? అనే అంశంపై ఎటూ తేల్చకుండా ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఇప్పుడు ఏది న్యాయమో తేల్చు కోలేని పరిస్థితి తలెత్తింది. ఈ తీర్పు విషయంలో ఇద్దరు జడ్జిల మధ్య బేధాభిప్రాయాలు చోటు చేసుకోవడం విశేషం. దీంతో ఏది న్యాయమో తేల్చ లేని విచిత్రమైన పరిస్థితి నెలకొంది.


వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలంటూ దాఖలైన వ్యాజ్యాలపై ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ లోని ఇద్దరు జడ్జిలువేరు వేరు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరుగా తీర్పును వెలువరించారు. దీంతో వ్యాజ్యాలు దాఖలు చేసిన వారు.. సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు అనుమతి కూడా ఇచ్చారు. ఐపీసీలోని సెక్షన్  375 ప్రకారం.. మైనర్ కాని భార్యతో భర్త లైంగిక సంభోగం జరపడం నేరం కాదని ఓ జడ్జి తీర్పు ఇచ్చారు.


ఈ సెక్షన్ రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ జరిపింది.  లైంగికంగా వేధించే భర్తతో కాపురం చేసే మహిళ హక్కుల్ని హరించేలా ఈ సెక్షన్ ఉందని వాదిస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్లు అభ్యర్థించారు. దీనిపై వాదనల అనంతరం ఢిల్లీ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది.
 

భార్య సమ్మతి లేకుండా లైంగిక సంభోగం చేసే భర్తను నేరస్థుడిగా పరిగణించవచ్చని డివిజన్ బెంచ్‌కు నేతృత్వం వహించిన జస్టిస్ రాజీవ్ షాక్దేర్ తీర్పు ఇచ్చారు. అయితే.. ఇందుకు భిన్నంగా అదే ధర్మాసనంలో మరో సభ్యుడైన జస్టిస్ హరి శంకర్ తీర్పు ఇచ్చారు. ఐపీసీలోని సెక్షన్ 375 రాజ్యాంగ విరుద్ధం కాదని జస్టిస్ హరిశంకర్ తీర్పు ఇచ్చారు. దీంతో ఇప్పుడు ఈ అంశం ఇక సుప్రీం కోర్టుకు ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఇది కేవలం ఏ ఒక్కరి వ్యవహారమో కాదు.. ఇప్పుడు ఇది సుప్రీం కోర్టు ముందుకు వెళ్తే.. అక్కడ వచ్చే తీర్పు దేశమంతటికీ వర్తిస్తుంది. అందుకే దీనిపై ఇంత చర్చ జరుగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: