ఏపీలో ప్రస్తుతం అధికార పార్టీ గడప గడపకు ప్రభుత్వం అనే కార్యక్రమం నిర్వహిస్తోంది. మొదట్లో దీన్ని గడప గడపకు వైసీపీ అనే టైటిల్‌ తో చేద్దామనుకున్నారు. కానీ.. ఈ కార్యక్రమంలో అధికారులు కూడా  పాల్గొంటారు. అలాంటప్పుడు పార్టీ పేరు పెడితే బాగోదని ఆ తర్వాత దాన్ని గడప గడపకూ ప్రభుత్వం అని మార్చారు. ఈ గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమం కోసం క్షేత్రస్థాయికి వెళ్తున్న ప్రజాప్రతినిధుల్ని ప్రజలు స్వాగతిస్తున్నారని వైసీపీ చెప్పుకుంటోంది.


జగన్ సర్కారు వల్ల ప్రతీ ఇంటికీ ఏదో ఒక లబ్ది కలిగిందని.. సుదీర్ఘకాలంగా పెండిగ్ లో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతున్నాయని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని శ్రద్ధతో చేయాలని ఇప్పటికే చెప్పారు. కార్యక్రమం అమలులో నాణ్యత ఉండాలని కేబినెట్ సమావేశం తర్వాత కూడా సీఎం మంత్రులకు సూచించారు. అంతే కాదు.. ప్రతీ ఇంటికీ శాసనసభ్యులు వెళ్లాల్సిందేనని తేల్చి చెప్పారు.


చెప్పింది చేశామన్న అంశాలను ప్రజలకు వివరించటంలో ఏమాత్రం అలసత్వం వద్దని సీఎం జగన్ నాయకులకు ప్రత్యేకంగా చెప్పారు. కొన్ని నియోజకవర్గాల్లో  వైసీపీ ఎమ్మెల్యేలు లేని చోట్ల ఇంఛార్జులు ఈ కార్యక్రమానికి వెళ్తారు. అధికారులతో పాటు పార్టీ కేడర్ ఉంటుంది వారే గడపగడపకూ కార్యక్రమంలో పాల్గోంటారని వైసీపీ నేతలు చెబుతున్నారు. పార్టీ కేడర్ కూడా ప్రభుత్వంతో కలిసే ఉంటుందని సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ కూడా క్లారిటీ ఇచ్చారు.


అయితే.. ఈ గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంపై టీడీపీ అనుకూల మీడీయా కొండంత ఆశలు పెట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఎక్కడ ఎలాంటి గొడవ జరిగినా దాన్ని హైలెట్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ కార్యక్రమం మొదటి రోజే అలాంటి ప్రచారం ప్రారంభించాయి తెలుగు దేశం అనుకూల మీడియా సంస్థలు. వైసీపీ మంత్రికి సెగ.. వైసీపీ ఎమ్మెల్యేకు సెగ అంటూ రచ్చ రచ్చ చేస్తున్నాయి. అయినా సరే ప్రజాప్రతినిధులు ప్రతి గడపకూ వెళ్లాల్సిందేనని ఆదేశిస్తున్నారు సీఎం జగన్.


మరింత సమాచారం తెలుసుకోండి: