ఏపీలో నిన్న మొన్నటి వరకూ విద్యుత్ కోతలు ఉన్నాయి. ఏపీలోనే కాదు.. దేశమంతటా ఉన్నాయి. కానీ.. అవేవో ఏపీలోనే ఉన్నట్టు టీడీపీ రచ్చ రచ్చ చేసేసింది. జగన్ రాష్ట్రాన్ని అంధకారమయం చేసేశాడని రోజూ విమర్శలు చేశారు. కానీ..అంతలోనే కరంట్ ఇబ్బందులు తొలగిపోయాయి. తాజాగా ఏపీలో పరిశ్రమలకు విద్యుత్ వినియోగంపై పరిమితులు ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. డిమాండ్ కు అనుగుణంగా పరిశ్రమలు ఇవాల్టి నుంచి  విద్యుత్ ను వినియోగించుకోవచ్చని ఏపీ ప్రభుత్వం  పేర్కోంది.


విద్యుత్ కొరత కారణంగా ఇప్పటి వరకూ 70 శాతం మేర విద్యుత్ వినియోగానికి మాత్రమే డిస్కమ్‌లు అనుమతించాయి. ఇక నుంచి పూర్తిస్థాయిలో వంద శాతం మేర విద్యుత్ ను వినియోగించుకోవచ్చని డిస్కమ్‌లు స్పష్టం చేశాయి. ఇక నుంచి పరిశ్రమలపై  విద్యుత్ పరిమితులు ఏమీ ఉండబోవు. ఈ మేరకు ఏపీ  ఇంధన శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని మూడు డిస్కమ్ లు 24 గంటలూ విద్యుత్ సరఫరా చేస్తాయని ఏపీ ప్రభుత్వం కూడా తెలియచేసింది.


ఈ నెల మే 9 తేదీన రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు పవర్ హాలిడేను ఎత్తి వేసిన సంగతి తెలిసిందే. అయితే.. అప్పుడు 50 శాతం విద్యుత్ వినియోగాన్ని 70 శాతానికి మాత్రమే  పెంచారు. ఇక ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా గృహ విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గిపోయింది. బహిరంగ మార్కెట్ లో కూడా విద్యుత్ అందుబాటులోకి వచ్చింది. దీంతో పరిశ్రమలకు పూర్తి స్థాయి విద్యుత్ వినియోగానికి అనుమతిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.


అంతే కాదు.. రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లోనూ బొగ్గు నిల్వలు పెరుగుతున్నాయి. ఇకపై 12 నుంచి 17 రోజుల నిల్వలు పెట్టుకోవాల్సిందిగా ప్రభుత్వం సూచనలు జారీ చేసింది.  ఏపీ జెన్కో విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకునేందుకు టెండర్లు కూడా పిలిచింది. మొత్తం 31 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు ను సమకూర్చుకోవాలని ఏపీ ప్రభుత్వం భావిస్తున్నట్టు ఏపీ ఇంధన శాఖ తెలియ చేసింది. మొత్తం మీద ఏపీలో కరెంటు కష్టాలు తొలగిపోయినట్టే భావించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: