ఏపీ సీఎం జగన్.. త్వరలో విదేశీ యాత్ర చేస్తున్నారు. ఓ పది రోజుల వరకూ అందుబాటులో ఉండరు. అందుకే ఆ పది రోజుల పాటు పార్టీ యాక్టివ్ గా ఉండేలా వైసీపీ మంత్రుల బస్సు యాత్రకు ప్లాన్ రెడీ చేసింది.  రాష్ట్ర వ్యాప్తంగా బస్ యాత్ర కు  ఏపీ మంత్రులు  సిద్దమవుతున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మంత్రులతో ఈ బస్ యాత్ర నిర్వహించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది.


ఈ నెల  26,  27, 28, 29  తేదీల్లో మంత్రుల బస్సు యాత్ర కొనసాగనుంది. బస్ యాత్ర లో మొత్తం 17మంది వరకూ మంత్రులు పాల్గొంటారు. ఇందుకు రెండు బస్ లను సిద్ధం చేశారు. ఈ యాత్ర..  విశాఖపట్నం  నుంచి ప్రారంభమై అనంతపురంలో ముగుస్తుంది. ముఖ్యమైన పట్టణాలు , నియోజకవర్గాలు, మండల కేంద్రాల మీదుగా బస్సు యాత్ర సాగే అవకాశం ఉంది. ఈ మేరకు రూట్ మ్యాప్ సిద్దం చేసినట్టు తెలుస్తోంది.


ముందుగా శ్రీకాకుళం,  రాజమండ్రి, నరసరావుపేట, అనంతపురంలో బహిరంగ సభలు ఏర్పాటు చేస్తారు. అక్కడ మంత్రులు ప్రసంగిస్తారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ,మైనార్టీలకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తోన్న సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను మంత్రులు వివరిస్తారు. స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవులు, రాజ్యసభ స్ఖానాల్లో  వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వం ఇస్తోన్న ప్రాధాన్యతలను మంత్రులు వివరించాలని నిర్ణయించారు. ప్రస్తుతం అన్ని అసెంబ్లీ  నియోజకవర్గాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు  చేస్తున్న సంగతి తెలిసిందే.


ఇక ఇప్పుడు మంత్రులు బస్సు యాత్రలో పాల్గొని దాన్ని మరింత విస్తృతం చేయబోతున్నారు. మొత్తం మీద ఏపీ సీఎం జగన్.. ఇకపై పార్టీ నాయకులను జనం మధ్యే ఉంచేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయం ఉన్నా.. నాయకులు జనం మధ్య ఉండాలని.. వారి సమస్యలు తీర్చాలని.. వారితో శభాష్ అనిపించుకుని మళ్లీ అధికారం అందుకోవాలని జగన్ ప్లాన్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: