2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా వేయాల్సిన అడుగులు, అనుసరించాల్సి విధానం, యువతకు పెద్దపీట వేస్తూ... ఉదయ్‌పూర్‌ వేదికగా ఇటీవల కాంగ్రెస్‌ నవ సంకల్ప్‌ చింతన్‌ శివిర్‌ మూడు రోజులపాటు జరిగింది. పార్టీలో సంస్థాగతంగా పెను మార్పులు చేస్తూ.. 50ఏళ్లు దాటిన వారికి ప్రాధాన్యత తగ్గించారు. సామాజిక, ఆర్ధిక, రాజకీయ, వ్యవసాయ, ఉపాధి రంగాల్లో రానున్న కాలంలో చేపట్టాల్సి అనేక సంస్కరణలపై తీర్మానాలు చేశారు. అధికారంలోకి వస్తే ఈవిఎంలకు స్వస్తి పలికి బ్యాలెట్‌ విధానం తీసుకురావాలని నిర్ణయించారు.


భావసారూప్య పార్టీలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని నిర్ణయించారు. దేశ వ్యాప్తంగా పలు అంశాలపై ప్రజలను చైతన్య పరిచేందుకు... భారత్‌జోడో, జన జాగరణ్‌, ఉపాధి దో వంటి ఆందోళనా కార్యక్రమాలను ప్రకటించారు.  వరుస ఓటములు కాంగ్రెస్ ను వేధిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే కాంగ్రెస్ సంస్థాగతంగా సమూల మార్పులకు కాంగ్రెస్‌ పార్టీ  సిద్ధమైంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌ వేదికగా మూడు రోజుల పాటు నవ సంకల్ప్ శివిర్‌ పేరుతో మేథో మథన సదస్సు నిర్వహించిన కాంగ్రెస్‌ అందులో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలతో... డిక్లరేషన్‌ను ప్రకటించింది.


ప్రతిపాదిత అంశాలపై కమిటీలు 3రోజుల పాటు చర్చించి రూపొందించిన తీర్మానాలను ఆయా కమిటీల ఛైర్మన్‌లో అధ్యక్షురాలు సోనియాగాంధీకి అందించారు. ఆమె వాటిని వర్కింగ్‌ కమిటి ముందు ఉంచారు. ఆరు కమిటీలు చేసిన మొత్తం 20 ప్రతిపాదనలకూ సీడబ్ల్యూసీ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత ఉదయ్‌పుర్‌ డిక్లరేషన్‌ను ప్రకటించారు. ఇప్పుడు ఈ ఉదయ్‌పుర్ డిక్లరేషన్‌పై కాంగ్రెస్ నేతలు ఆశలు పెట్టుకున్నారు.


డిక్లరేషన్‌లో ప్రకటించిన పలు కీలక నిర్ణయాలు కాంగ్రెస్ తలరాత మారుస్తాయా.. ఒక కుటుంబానికి ఒకే టికెట్‌ ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. రెండో వ్యక్తికి టికెట్‌ కావాలంటే.. వారు అయిదేళ్లు నిబద్ధతతో పార్టీకి సేవ చేసి ఉండాలని షరతు పెట్టింది. కొత్త వ్యక్తులకు అవకాశం ఇచ్చేందుకు ఒక వ్యక్తి అయిదేళ్లకు మించి పదవుల్లో ఉండరాదని కాంగ్రెస్‌ నిర్ణయం తీసుకుంది. మరి ఇవన్నీ కాంగ్రెస్ తలరాత మారుస్తాయా?

మరింత సమాచారం తెలుసుకోండి: