కేసీఆర్‌ తన ఎనిమిదేళ్ల పాలనలో చేపట్టిన కొన్ని మంచి కార్యక్రమాలు ఇప్పుడు సత్ఫలితాలు అందిస్తున్నాయి. అలాంటి వాటిలో హరిత హారం ఒకటి. కేసీఆర్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ హరిత హారానికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ఏటా కోట్ల సంఖ్యలో మొక్కలు నాటించారు. దాన్నో యజ్ఞంలా నిర్వహించారు. ఇప్పుడు దాని ఫలితాలు లభిస్తున్నాయి. హరితహారం చేపట్టిన తర్వాత తెలంగాణలో గ్రీన్ కవర్  7.7 శాతం పెరిగిందట. ఈ విషయాన్ని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక తాజాగా తెలిపింది.


ఫారెస్ట్ సర్వే నివేదికలోని వివరాలను వెల్లడించిన తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. బంగారు తెలంగాణ దిశలో 33శాతం పచ్చదనమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ప్రకటించింది. ఈ హరిత హారం కార్యక్రమం.... ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మానవ ప్రయత్నమని సదరు నివేదికలో తెలిపారు. కేసీఆర్‌ సీఎం అయిన తర్వాత ఈ  8ఏళ్లలో మొత్తం 8, 511 కోట్ల రూపాయలు ఈ హరిత హారం కోసం ఖర్చు చేశారు. ఈ మొత్తం డబ్బుతో ఇప్పటి వరకూ 243 కోట్ల మొక్కలు నాటారు.


ఇప్పటి వరకూ తెలంగాణ ప్రభుత్వం 9 లక్షల పైచిలుకు ఎకరాల్లో అడవులను పునరుద్ధరించింది. ఇంకా  నగరాలు, పట్టణాల్లో 109 అర్బన్ ఫారెస్ట్ పార్కులు అభివృద్ధి చేసింది. ప్రత్యేకంగా హరిత హారం కోసం గ్రీన్ బడ్జెట్ ఏర్పాటు చేసిన విషయాన్ని తెలంగాణ సర్కారు గుర్తు చేస్తోంది. పట్టణ, గ్రామీణ స్థానికసంస్థల్లో 10శాతం హరితబడ్జెట్ ను కేటాయించింది. ఈ మేరకు కచ్చితంగా  ఖర్చు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది.


ఈ హరిత హారం కార్యక్రమంలో భాగంగా తెలంగాణలోని 12,769 గ్రామ పంచాయతీల్లో నర్సరీలను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయించింది. ఈ మొక్కలను నాటించి సంరక్షించే బాధ్యతను స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు,అధికారులకు అప్పగించింది. కేవలం మొక్కలు నాటించి వదలేయకుండా.. వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కనీసం 80 శాతం మొక్కలు బతికేలా చర్యలు తీసుకుంది. ఈ చర్యల ఫలితంగానే ఇప్పుడు హరిత తెలంగాణ సాకారం అవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

kcr