ఇప్పుడు ఇండియాలో కరోనా భయం పూర్తిగా పోయింది. జనం అసలు మాస్కులు పెట్టుకోవడమే మరిచిపోయారు. కరోనాతో పడిన ఇబ్బందులనూ క్రమంగా మరిచిపోతున్నారు. అయితే.. మళ్లీ ఇండియాలో కరోనా విజృంభించే అవకాశం ఉందా.. అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే.. దేశ ఆర్థిక రాజధానిగా చెప్పుకునే ముంబయిలో మళ్లీ కరోనా తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం ముంబయిలో కొవిడ్‌ పాజిటివిటీ రేటు 6శాతానికి చేరింది.


ఇలా కరోనా పాజిటివిటీ రేటు పెరగడం ఇప్పుడు ముంబయి నగర వాసుల్లో ఆందోళన కలిగిస్తోంది. అప్రమత్తమైన బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ మళ్లీ  కొవిడ్‌ పరీక్షలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని యోచిస్తోంది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. టెస్టింగ్‌ ల్యాబ్‌లను అప్రమత్తం చేసింది. అలాగే పూర్తిస్థాయి వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని సిబ్బందిని ఆదేశించింది. గత మంగళవారం ముంబయిలో ఒక్కరోజే 506 మందికి వ్యాపించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 6 తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు ఎప్పుడూ కాలేదు.. అందుకే ఈ కరోనా మళ్లీ ముదురుతుందేమో అన్న అనుమానం వస్తోంది.


అలాగే.. ఏప్రిల్‌ నెలతో పోలిస్తే మే నెలలో కేసుల సంఖ్య కూడా దాదాపు రెట్టింపైందని ముంబయి మున్సిపల్ కార్పొరేషన్‌ చెబుతోంది. అందుకే ముందు జాగ్రత్తగా 12 నుంచి 18 ఏళ్ల పిల్లలకు టీకాలను విస్తృతంగా పంపిణీ చేస్తున్నారు. అలాగే బూస్టర్‌ డోసు పంపిణీని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ముంబయి మున్సిపల్ కార్పొరేషన్‌  అధికారులకు సూచించింది. అయితే కరోనా టీకాను విస్తృతంగా పంపిణీ చేసినందువల్ల పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముంబయిలోని వైద్య శాఖ అధికారులు భావిస్తున్నారు.


అలాగని నిర్లక్ష్యంగా ఉండట్లేదని.. అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నామని ముంబయి వైద్య శాఖ అధికారులు చెబుతున్నారు. అందులోనూ కరోనా టీకాలు పంపిణీ చేసినా.. ఎప్పటి కప్పుడు కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్న సమయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉంది. కేవలం ముంబయిలోనే కాదు.. ఇది అన్ని నగరాలకూ వర్తిస్తుంది సుమా.

మరింత సమాచారం తెలుసుకోండి: