తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ఆంధ్రా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌తో ఆదివారం భేటీ కావడం సంచలనం కలిగించింది. కేసీఆర్‌ జాతీయ పార్టీ పెట్టే ఆలోచనలో ఉండటంతో ఈ భేటీకి మరింత ప్రాధాన్యత వచ్చింది. అందులోనూ మంచి వ్యూహకర్తగా దేశంలోనే పేరున్న ప్రశాంత్‌ కిషోర్‌ కూడా ఈ చర్చల్లో పాల్గొనడంతో అంతా ఈ భేటీపై ఆసక్తి చూపించారు. అయితే..ఆ భేటీలో అసలు ఏం జరిగింది.. ఏ ఏ అంశాలపై చర్చించారు.. ఇంతకీ కేసీఆర్ జాతీయ పార్టీలో ఉండవల్లి పని చేస్తారా.. ఈ అంశాలపై ఉండవల్లి ఏమన్నారో చూద్దాం..  


ఎంతటి క్లిష్టమైన అంశాన్నైనా సరళంగా.. సామాన్యుడికి అర్థమయ్యేలా చెప్పడంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ దిట్ట అని ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ ఆయనతో భేటీ తర్వాత అంటున్నారు. జాతీయ అంశాలపై కేసీఆర్‌ కసరత్తు చేశారని, చాలా విషయాల్లో స్పష్టమైన అవగాహనతో ఉన్నారని ఉండవల్లి అంటున్నారు. ఆయనతో భేటీలో ఏం జరిగిందో వివరించిన ఉండవల్లి.. ప్రతి విషయాన్ని కేసీఆర్‌ స్పష్టంగా వివరించారని తెలిపారు. జాతీయ రాజకీయాలపై కేసీఆర్‌కు చాలా క్లారిటీ ఉందని.. ఒక ఎజెండా ప్రకారం ముందుకు వెళ్తున్నారని.. సాగు, తాగునీరు, విద్యుత్తు తదితర అంశాలపై కేసీఆర్‌ చాలా హోం వర్క్‌ చేశారని ఉండవల్లి అన్నారు.


కేసీఆర్‌తో భేటీ వివరాలు వివరిస్తూ.. తాను మాత్రం రాజకీయాలకు దూరంగా ఉంటానని కేసీఆర్‌తో చెప్పానని ఉండవల్లి అన్నారు. దేశంలోని అనేక అంశాలపై సీఎం కేసీఆర్‌ చెప్తుంటే తాను చాలా ఆశ్చర్యపోయానని ఉండవల్లి వివరించారు. కేసీఆర్‌ తనకు ఎంతో గౌరవమిచ్చారన్న ఉండవల్లి.. మూడు గంటల పాటు చర్చించామని తెలిపారు. కేసీఆర్‌తో సమావేశమైనప్పుడు ప్రశాంత్‌ కిశోర్‌ కూడా ఆ సమావేశంలో పాల్గొన్నారని ఉండవల్లి క్లారిటీ ఇచ్చారు.


అయితే.. తమ మధ్య జాతీయ పార్టీ ఏర్పాటు గురించి టాపిక్‌ రాలేదని ఉండవల్లి తెలిపారు.  బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేయగల శక్తి మాత్రం కేసీఆర్‌కు ఉందని తాను నమ్ముతున్నానని.. బీజేపీ విషయంలో మాట్లాడటం ఇంకా పెంచాలని తనకు సూచించారని ఉండవల్లి చెప్పారు. బీజేపీపై కేసీఆర్‌, తాను ఒకే ఆలోచనతో ఉన్నామని ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: