కేంద్ర మంత్రులు అంటే.. ఎక్కువగా ఢిల్లీలోనే ఉంటుంటారు.. ఏదైనా ప్రత్యేక మైన కార్యక్రమం ఉంటే తప్ప రాష్ట్రాలకు పెద్దగా రారు..అందులోనూ ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో తప్ప ఇతర రాష్ట్రాల్లో కేంద్రమంత్రుల పర్యటనలు తక్కువ. కానీ.. ఎందుకో ఇటీవల ఏపీలో కేంద్ర మంత్రులు వరుసగా పర్యటిస్తున్నారు. అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.


ఒకరి తర్వాత మరొకరు వరుసగా కేంద్ర మంత్రులు ఆంధ్రప్రదేశ్‌కు క్యూ కడుతున్నారు.. మొన్నటికి మొన్న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి భారతి వచ్చారు.. మంగళగిరిలోని ఎయిమ్స్ ను సందర్శించారు. ఆ తరవాత విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించి సేవలు ఎలా ఉంటున్నాయో అడిగి తెలుసుకున్నారు. ఆమె పర్యటన జరుగుతుండగానే.. మరో కేంద్ర మంత్రి జై శంకర్‌ వచ్చారు.


ఆయన అనకాపల్లి వంటి జిల్లాల్లో పర్యటించారు. ఇక తాజాగా కేంద్ర సమాచార, ప్రసార, మత్స్య పశు సంవర్థక శాఖ సహాయ మంత్రి మురుగన్ వచ్చారు. ఆయన కాకినాడ జిల్లాలో పర్యటించారు. గొల్లప్రోలు, మండలం చేబ్రోలులో మిషన్ అమృత్ సరోవర్ లో భాగంగా కృష్ణంరాజు చెరువు పునరుద్ధరణ పనుల్ని ఆయన ప్రారంభించారు. అక్కడ మొక్కలు కూడా నాటారు. ఉపాధి హామీ కూలీలతో కొద్దిసేపు మాట్లాడారు. పెద్దాపురం మండలం జి.రాగంపేటలో ఏర్పాటు చేసిన జల జీవన్ మిషన్ ను కేంద్ర మంత్రి మురుగన్ సందర్శించారు.


అంతకుముందు తెలుగు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి కూడా ఏపీలో పర్యటించారు. ఇంత తక్కువ వ్యవధిలో ఇంతమంది కేంద్ర మంత్రులు ఏపీకి రావడం చూస్తే.. ఏదో జరుగుతుందన్న భావన కలుగుతోంది. ఓవైపు రాష్ట్రపతి ఎన్నికలు ఉన్న సమయంలో ఏపీ సీఎం జగన్ను ప్రసన్నం చేసుకునేందుకు ఇలా పర్యటనలు చేస్తున్నారా.. లేక ఏపీలో పార్టీని బలోపేతం చేసుకునేందుకు మంత్రుల పర్యటనలను వాడుకుంటున్నారా.. అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ఏదో రాజకీయం జరుగుతోందన్న భావన మాత్రం రాజకీయ వర్గాల్లో కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: