కేసీఆర్ ఇటీవల దిల్లీ రాజకీయాలపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణ కార్యక్రమం కూడా ఊపందుకుంటోంది. దిల్లీలోని వసంత్ విహార్ లోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి మరో ముందడుగు పడింది. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేసి నిర్మాణపనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం ప్రముఖ వాస్తు నిపుణులు సుద్దాల సుధాకర్ తేజ సమక్షంలో జరిగింది.


ఈ భవన నిర్మాణంలో లోవర్ గ్రౌండ్ త్రవ్వకం పనులు పూర్తి అయ్యాయి.  పుటింగ్ పనులు ప్రారంభం కోసం ముగ్గు పోసి మిగతా పనులు పూర్తి చేయనున్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.. పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. పనుల ప్రారంభం అనంతరం నిర్మాణ సంస్థతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా దిల్లీలో టి.ఆర్.ఎస్ పార్టీ తెలంగాణ భవన నిర్మాణ పనులు జరగాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వారిని ఆదేశించారు.


అనుకున్న లక్ష్యానికి అనుగుణంగా పనులు వేగంగా.. నాణ్యతతో  జరగాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. ముఖలో పుట్టి పుబ్బలో కలుస్తుందని ఎగతాళి చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కేసిఆర్ నాయకత్వంలో నేడు యావత్ తెలంగాణ ప్రజలు సగర్వంగా తలెత్తుకునేల దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున పార్టీ కార్యాలయం నిర్మించుకుంటుందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అంటున్నారు. ఇంతటి చారిత్రాత్మక, బృహత్తర కార్యక్రమంలో తనను భాగస్వామ్యం చేసినందుకు కేసిఆర్, కేటిఆర్ లకు మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.


దిల్లీలో పార్టీ కార్యాలయం నిర్మించుకోవాలన్న కల కేసీఆర్‌కు ఎప్పటి నుంచో ఉంది. టీఆర్‌ఎస్‌ ఎంపీలు, ఇతర నేతలు దిల్లీ వచ్చినప్పుడు ఏ తెలంగాణ భవన్‌లోనో బస చేయాల్సివస్తోంది. ఆ ఇబ్బందులు తొలగించుకునేందుకు.. టీఆర్ఎస్‌కు అంటూ ఓ చిరునామా ఉండాలని కేసీఆర్ భావించారు. మొత్తానికి ఆ కల సాకారం చేసుకుంటున్నారు. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అని కేసీఆర్ తలచుకుంటే భవన నిర్మాణం చకచకా పూర్తవుతుందనడంలో ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: