ఆయన జగన్ కేబినెట్‌లోనే సీనియర్ మంత్రి.. కానీ.. మొన్నటి మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణలో ఆయన శాఖ మారింది. దాంతో ఆయన చిన్నబుచ్చుకున్నారన్న వార్తలు వచ్చాయి. అందుకే ఆ మంత్రి వర్గ శాఖను కూడా అంత త్వరగా బాధ్యతలు స్వీకరించలేదు. ఇంతకీ ఆయన ఎవరో చెప్పలేదు కదా.. మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. ఆయనే విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.


ఆయనకు ఇంకా మంత్రి వర్గ శాఖ మార్పుపై అలక తీరినట్టు లేదు. ఎందుకంటే.. తాజాగా సీఎం జగన్ నిర్వహించిన కీలకమైన సమీక్షకు కూడా మంత్రి బొత్స హాజరుకానే లేదు. విద్యాశాఖలో నాడు–నేడు, డిజిటల్‌ లెర్నింగ్‌ పై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించినా మంత్రి బొత్స హాజరు కాలేదు. ఈ  సమావేశానికి సీఎస్‌ సమీర్‌ శర్మ, పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు హాజరైనా మంత్రి బొత్స మాత్రం రాలేదు. ఈ కీలకమైన సమావేశానికి మంత్రి బొత్స సత్యనారాయణ హాజరు కాకపోవడం చర్చనీయాంశం అవుతోంది.


దీంతో చేసేదేమీ లేక సీఎం జగన్ మంత్రి బొత్స లేకుండానే సమీక్ష నిర్వహించారు. పలు ముఖ్యమైన  అంశాలపై అధికారులతో చర్చించి సీఎం జగన్ ఆదేశాలిచ్చారు.  సెప్టెంబరులో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ ఇస్తామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. ఆ ట్యాబ్‌లో బైజూస్‌ కంటెంట్‌ను లోడ్‌ చేయాలని విద్యాశాఖ అధికారులకు సీఎం జగన్ సూచించారు.


బైజూస్‌ కంటెంట్‌కు తగ్గట్టుగా ట్యాబ్‌  స్పెసిఫికేషన్స్, ఫీచర్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని  సీఎం జగన్ సూచించారు. ఇవి నిర్దారించాకే ట్యాబ్‌ల కొనుగోలు ప్రక్రియ ప్రారంభించాలని సీఎం సూచించారు. టెండర్లు పిలిచేటప్పప్పుడు నాణ్యత, మన్నిక  దృష్టిలో ఉంచుకోవాలన్నారు. 8వ తరగతి లో విద్యార్థికి ఇచ్చే ట్యాబ్  9, 10 తరగతుల్లో కూడా పనిచేయాలని చెప్పారు. మూడేళ్లపాటు ట్యాబ్‌ నాణ్యతతో పనిచేసేలా ఉండాలని.. ట్యాబ్ లకు ఏదైనా సమస్య వస్తే.. వెంటనే దాన్ని రిపేరు చేసి, నిర్దేశిత సమయంలోగా ట్యాబ్‌లు పిల్లలకు అందేలా ప్రణాళికలు ఉండాలని సీఎం జగన్ సూచించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: