ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి డబ్బులు మాయం అయ్యాయన్న వివాదం జగన్ ప్రభుత్వానికి ఇబ్బంది కరంగా తయారవుతోంది. ఉద్యోగుల ఖాతాల నుంచి ఇలా డబ్బు విత్‌డ్రా చేసుకునే సౌకర్యం ప్రభుత్వానికి ఉంటుంది. అయితే దీన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని.. తనకు అవసరమైనప్పుడు ఈ ఖాతాల్లోంచి డబ్బు తీసుకుని.. మళ్లీ అవసరం తీరాక అకౌంట్లలో జమ చేస్తోందని ఆరోపణలు ఉన్నాయి. గతంలోనూ ఇలాగే ఓసారి జరిగిందని.. అప్పుడు తాము అడిగిన తర్వాత మళ్లీ తమ అకౌంట్లలో డబ్బు వేశారని ఉద్యోగ సంఘ నేతలు చెబుతున్నారు.


ఇలా జీపీఎఫ్‌ అకౌంట్ల నుంచి ప్రభుత్వం డబ్బు తీసుకోవడమంటే ఉద్యోగులను మోసగించడమే అంటున్నారు ఉద్యోగ సంఘాల నేతలు.. రూ.800 కోట్లు ఎటు మళ్లించారో సీఎమ్ సమాధానం చెప్పాలంటున్నారు.. వైసీపీ ప్రభుత్వ పెద్దలకు సూట్ కేసు కంపెనీలు పెట్టి, దొంగ లెక్కలు రాసిన అనుభవంతో కాగ్ కళ్ళకు గంతలు కట్టేలా నివేదికలు ఇస్తున్నారని విపక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి.


పథకాల లబ్ధిదారుల లెక్కల్లోనూ మాసిపూసి మారేడుకాయ చేస్తోందని... ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన జీపీఎఫ్ సొమ్ములను వారికి తెలియకుండా ప్రభుత్వమే మాయం చేయడం విస్మయం కలిగిస్తోందని విపక్షాలు అంటున్నాయి. ఇప్పటి వరకూ వెలుగులోకి వచ్చిన లెక్కల ప్రకారం రూ.800 కోట్లు సొమ్మును ప్రభుత్వం మళ్లించిందంటున్న విపక్షాలు.. ఉద్యోగుల ఖాతాల్లో ఉన్న ఈ డబ్బులు వారికి తెలియకుండా తీసేసుకోవడం అంటే మోసం చేయడమేనంటున్నాయి.


వైసీపీ ప్రభుత్వ ఆర్థిక పాలన ఆశ్చర్యం కలిగిస్తోందంటున్న ఉద్యోగ సంఘాల నేతల..  జీపీఎఫ్ ఖాతాలోని డబ్బులను డ్రా చేసుకొనే అధికారం కేవలం ఉద్యోగికి మాత్రమే ఉంటుందని గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వం ఆ నిధికి కేవలం కస్టోడియన్ మాత్రమేనని.. కాపలాదారే దోపిడీకి పాల్పడితే ఎలాగని ప్రశ్నిస్తున్నారు. వైద్య ఖర్చులకో, బిడ్డ పెళ్ళికో, చదువులకో పీఎఫ్ డబ్బుల కోసం దరఖాస్తు చేస్తే నెలల తరబడి అనుమతి ఇవ్వకుండా పెండింగ్లో ఉంచుతున్న ప్రభుత్వం.. ఆ ఉద్యోగుల సొమ్మును వారికి తెలియకుండానే తీసేసుకొంటోందని ఆరోపిస్తున్నారు. మరి ఈ విమర్శలకు వైసీపీ సర్కారు ఏమని సమాధానం చెబుతుందో?

మరింత సమాచారం తెలుసుకోండి: