పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరుగుతోందంటూ చంద్రబాబు కేంద్రానికి తాజాగా లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వ తప్పుడు నిర్ణయాల కారణంగా ప్రాజెక్టుకు సాంకేతింగా నష్టం జరిగిందని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు చంద్రబాబు లేఖ రాశారు. వైసిపి ప్రభుత్వం వచ్చిన తరువాత తీసుకున్న ఏకపక్ష నిర్ణయాల కారణంగా బహుళార్థక సాధక ప్రాజెక్టుకు నష్టం జరిగిందని లేఖలో చంద్రబాబు రాసుకొచ్చారు. ప్రాజెక్టు విషయంలో వెంటనే స్పందించి పోలవరం సత్వర పూర్తికి  సహకరించాలని కేంద్ర మంత్రిని చంద్రబాబు లేఖలో కోరారు.


పోలవరం పై కేంద్రం, పీపీ రాష్ట్రానికి చేసిన సూచనలు, హెచ్చరికలను ప్రభుత్వం పెడచెవిన పెట్టి నష్టం చేసిందని చంద్రబాబు ఆ లేఖలో రాసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకుని టీడీపీ ప్రభుత్వం మొత్తం ప్రాజెక్టు పనుల్లో దాదాపు 71 శాతం పూర్తి చేసిందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం తన ఉద్దేశ్య పూర్వక, అసమర్థ నిర్ణయాల ద్వారా పోలవరం ప్రాజెక్టుకి అడ్డంకులు సృష్టించి ప్రాజెక్టు భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టిందని చంద్రబాబు ఆరోపించారు.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు నిర్మాణంలో కలవరపెడుతున్న పరిణామాలను మీ దృష్టికి తెస్తున్నానన్న చంద్రబాబు.. ఈ పరిణామాలను పరిష్కరించి వీలైనంత త్వరగా ప్రాజెక్టు పూర్తిచేసేందుకు కృషి చేస్తారని ఆశిస్తున్నానంటూ లేఖలో రాసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న తీరు తలచుకుంటే నాకు చాలా బాధగా ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన మొదటి రోజే అంటే జూన్ 1, 2019 న, భారత ప్రభుత్వ సంస్థల నుండి ఆమోదం పొంది పోలవరం పనులు చేస్తున్న కాంట్రాక్టర్ ను మార్చాలని నిర్ణయించిందని చంద్రబాబు తెలిపారు.


మొత్తం మీద ఈ లేఖలో అంతా జగన్ సర్కారుదే తప్పని రాసుకొచ్చిన చంద్రబాబు.. కేంద్రం తీరుపై మాత్రం పల్లెత్తు మాట అనకుండా జాగ్రత్తపడటం విశేషం. మేం రైటు.. మీరు రైటు.. మధ్యలో వచ్చిన ఈ జగన్‌దే అంతా తప్పు అంటూ చంద్రబాబు తన లేఖలో రాసుకొచ్చారన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: