పోలవరం ప్రాజెక్టు పనుల్లో వేగం తగ్గింది. డయాఫ్రమ్ వాల్ దెబ్బ తిన్న కారణంగా..దాన్ని సరిదిద్దకుండా ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉంది. దీనివల్ల ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేయగలమో ఎవరూ చెప్పలేని పరిస్థితి ఉంది. అయితే.. ఈ పాపం అంతా జగన్ సర్కారుదే అటోంది టీడీపీ. జగన్ అధికారంలోకి వచ్చీ రాగానే రివర్స్ టెండరింగ్ పేరుతో 2019 నవంబర్ లో పనులు మరొక ఏజెన్సీకి అప్పగించారని.. ఆకస్మికంగా పనులు నిలిపివేయడంతో టెండర్ల ప్రక్రియ ముగిసి కొత్త ఏజెన్సీ పనులు చేపట్టేందుకు ఆరు నెలల సమయం పట్టిందని టీడీపీ ఆరోపిస్తోంది.


ఈ ఆరు నెలల్లో ప్రాజెక్ట్ వద్ద ఏ ఏజెన్సీ కూడా ప్రాజెక్టు పనులను పర్యవేక్షించలేదని.. కాంట్రాక్టర్ ను మార్చే క్రమంలో ప్రాజెక్టు వరద నిర్వహణ పనులు చేపట్టలేదు. ఈ కారణంగా డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడం జరిగిందని టీడీపీ వాదిస్తోంది. డయాఫ్రమ్ వాల్‌ను రికార్డు సమయంలో నదీగర్భం లో 40మీ నుంచి 100మీ లోతు వరకు ఒక ప్రఖ్యాత ఏజెన్సీ నిర్మించడం జరిగిందని.. పోలవరం పనులు సంతృప్తి కరంగా ఉన్న సమయంలో కాంట్రాక్టర్ ను మార్చాల్సిన అవసరం లేదని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసిందని టీడీపీ గుర్తు చేసింది.


పోలవరం ప్రాజెక్టు అథారిటీ రాష్ట్ర ప్రభుత్వం అసమర్థ నిర్ణయాలు తీసుకోకుండా అడ్డుకునే ప్రయత్నం చేసిందని.. ప్రాజెక్ట్ పూర్తి చేయడంలో నిరవధిక జాప్యం అవుతుందని, ప్రాజెక్టే అనిశ్చితిలో పడే ప్రమాదం ఉందని కూడా పీపీఏ హెచ్చరించిందని కూడా టీడీపీ వాదిస్తోంది. పీపీఏ ముందస్తు హెచ్చరికలు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగిందని.. 17 ఆగస్టు 2019న టెండర్ నోటీసును జారీ చేసిందని.. నిర్మాణం ఆలస్యం కారణంగా ప్రాజెక్టుల ప్రయోజనాలను కోల్పోయే ప్రమాదం ఉందని తాము సైతం వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించామని టీడీపీ గుర్తు చేసింది.


అయినప్పటికీ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తిచేయడంలో వైసీపీ ప్రభుత్వం శ్రద్ధ చూపలేదన్న టీడీపీ.. వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వక తప్పిదాలు, పర్యవేక్షణ లేకపోవడంతో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని వాదిస్తోంది. ప్రాజెక్టు నిర్మాణం జాప్యంతో సాగునీటి సరఫరా, నదుల అనుసంధానం ప్రక్రియకు ఆటంకాలు ఏర్పడ్డాయని టీడీపీ చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: