ఏపీ ప్రభుత్వం కొన్ని మీడియా సంస్థలను తనకు శత్రువులుగా ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. సాక్షాత్తూ సీఎం జగనే..అనేక సార్లు ఇటీవల ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లపై తాను పోరాటం చేస్తున్నానని చెప్పుకుంటున్నారు. వీరు తననేమీ పీకలేరని కూడా తరచూ వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు కంటే తనకు వీరే అసలైన శత్రువులు అని జగన్ ఫిక్స్ అయ్యారు కూడా. అందుకే తరచూ ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలోనూ ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ మాట్లాడుతున్నారు. ఈ మీడియా సంస్థలను మారీచ మీడియా అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు.


అయితే.. తన శత్రువులుగా భావిస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలను దెబ్బ కొట్టేందుకు జగన్ మరో కొత్త ఆలోచన చేసినట్టు కనిపిస్తోంది. దినపత్రిక కొనుగోలుకు వాలంటీర్లకు నెలకు రూ.200 ఇవ్వాలని నిర్ణయించడం ద్వారా ఈ రెండు పత్రికల సర్క్యులేషన్ పై ప్రభావం చూపాలని జగన్ సర్కారు భావిస్తున్నట్టు అర్థమవుతోంది. ఏపీలో 2.66 లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు. వారందరికీ రోజూ పేపర్ కొనుక్కునేందుకు గాను ఇకపై నెలకు రూ.5.32 కోట్లు వెచ్చించబోతున్నారు. ఇలా ఎందుకు అంటే.. ప్రభుత్వ సంక్షేమ పథకాల సమాచారాన్ని తెలుసుకునేందుకు, సమకాలీన అంశాలపై మరింత అవగాహన, పరిజ్ఞానం పెంచుకునేందుకు వీలుగానట.


అందు కోసం విస్తృతమైన సర్క్యులేషన్‌ కలిగిన దినపత్రిక కొనుక్కునేందుకు గ్రామ, వార్డు వాలంటీర్లకు నెలా రూ.200 చొప్పున ఇస్తారట. ఈ మేరకు జూన్‌ 29న ఓ జీవో ఇచ్చారు. ఇది ఇప్పుడు  వెలుగులోకి వచ్చింది. వీరు రోజూ పేపర్ చదివి.. ప్రభుత్వ పథకాలు, సేవలపై ఏదైనా మీడియాగానీ, వ్యక్తులుగానీ ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడతారట. అలాగే అసలు విషయాన్ని ప్రజలకు వివరిస్తారట. సరే.. జీవోల్లో ఏం చెప్పుకున్నా ఈ కొత్త ఆలోచన వెనుక అసలు విషయం ప్రభుత్వ అనుకూల పత్రిక సాక్షి సర్క్యులేషన్ పెంచడమే కావచ్చు.


ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో వాలంటీర్లు తప్పకుండా సాక్షి పత్రికే కొనే అవకాశం ఉంది. ఆ మేరకు సాక్షి సర్క్యులేషన్‌ గణనీయంగా పెరుగుతుంది. అంటే సర్కారు సొమ్ముతో సాక్షి సర్క్యలేషన్‌ పెరగడం ఖాయం.. ఆ మేరకు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలపై ప్రభావం చూపడం ఖాయం అన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: