ప్రధాని నరేంద్ర మోడీ మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటున్నారు. సొంత పార్టీ కార్యకవర్గ సమావేశాలకు హాజరయ్యేందుకు తెలంగాణ వచ్చిన మోడీ.. ఆ రాష్ట్రంలో రెండు రోజుల పాటు పర్యటించారు. హైదరాబాద్ కేంద్రంగానే ఆయన పర్యటన సాగింది. ఆ తర్వాత ఏపీలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమం కోసం ఆయన ఏపీకి వచ్చారు. అలా మొత్తం మూడు రోజులు ప్రధాని నరేంద్ర మోడీ తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నారు.


అయితే.. ఈ ప్రధాని పర్యటన కారణంగా ఎక్కువగా సంతోషపడుతోంది మాత్రం తెలుగు ప్రముఖ దిన పత్రికలే అని చెప్పాలి.. ప్రధాని వస్తే సాధారణంగానే మీడియా కవరేజ్ విస్తృతంగా ఉంటుంది. అందులోనూ ప్రధాని మోదీ ఇలా తెలుగు రాష్ట్రాల పర్యటనలకు రావడం చాలా తక్కువ. అయితే ఈ ప్రధాన పత్రికలు పండుగ చేసుకుంటోంది వార్తల విషయంలో కాదండోయ్.. ఈ పండుగ అంతా యాడ్స్ విషయంలో.


అవును.. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా తెలుగు ప్రధాన పత్రికల్లో ఫుల్ పేజీ యాడ్స్ విపరీతంగా పెరిగాయి. ప్రధాని నరేంద్ర మోడీకి కొత్త శత్రువుగా తయారైన కేసీఆర్‌.. ప్రధాని పర్యటన కవరేజ్‌ మీడియాలో ఎక్కువగా కనిపించకుండా.. పార్టీ యాడ్స్, ప్రభుత్వం యాడ్స్ ఫుల్ పేజీలతో కుమ్మేశారు. దీనికి తోడు బీజేపీ వాళ్లు కూడా ప్రధాని పర్యటన ఎక్కువగా ప్రజలకు తెలిసేందుకు ఫుల్ పేజీ యాడ్స్ ఇచ్చేశారు. దీంతో అటు ప్రభుత్వం యాడ్స్.. ఇటు బీజేపీ యాడ్స్‌ .. ఇలా ప్రధాన  పత్రికలన్నీ రెండు, మూడు రోజులుగా ఫుల్ పేజీలతోనే నిండిపోయాయి.


సొంత కవరేజ్‌ కోసం ఒకరు.. ప్రత్యర్థులకు కవరేజ్‌ రాకూడదని మరొకరు.. మొత్తానికి టీఆర్ఎస్‌- బీజేపీ పోరు ప్రధాన పత్రికలకు మాత్రం యాడ్స్ కరవు తీర్చేసింది. ఒక్కో నాయకుడు తమకు పేరు రావాలన్న కోరికతో ఫుల్‌ పేజీ యాడ్స్ ఇచ్చేశారు. చివరకు ప్రధాని భీమవరం పర్యటన సమయంలో కూడా ఇవాళ కేసీఆర్‌ ముఖచిత్రంతో ఈనాడులో క్షతయ సేవా సమితి పేరుతో ఫుల్ పేజీ యాడ్ ఇచ్చేశారు. బహుశా ప్రధాని మోదీ ప్రసంగం ప్రముఖంగా కనిపించకుండా ఉండేందుకు ఈ జాగ్రత్తలు తీసుకున్నారేమో మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: