జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొత్తగా జనవాణి అనే కార్యక్రమం చేపట్టారు. దీన్ని కొంతకాలం ప్రతి ఆదివారం నిర్వహిస్తామంటున్నారు. ఈ కార్యక్రమం వివరాలేంటంటే.. ఆయన ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటారు. ప్రజల నుంచి తమ సమస్యలపై ఫిర్యాదులు స్వీకరిస్తారు. అయితే.. ఈ కార్యక్రమం వల్ల సాధించేందేంటనే విషయం మాత్రం చెప్పలేకపోతున్నారు.


జనవాణికి నిన్న అనేక రకాల ఫిర్యాదులు వచ్చాయి.. రాష్ట్రం నలుమూలల నుంచి విజయవాడ వచ్చిన జనసేన జనవాణి కార్యక్రమంలో ప్రజలు ఫిర్యాదులు చేశారు.. ఓకే.. కానీ ఈ ఫిర్యాదులతో పవన్ కల్యాణ్‌ ఏం చేస్తారు.. వీటిని అధికారులకు పంపుతామంటున్నారు.. వీటిలో చాలా వరకూ గతంలో స్పందన కార్యక్రమంలో ఫిర్యాదులు చేసినవారే. దీనివల్ల అక్కడ చెప్పిన సమాధానమే మరోసారి చెప్పే అవకాశం ఉంది. స్పందనలో కాకుండా పవన్ కల్యాణ్ వద్ద ఫిర్యాదు చేస్తే వచ్చే లాభమేంటన్నది అర్థం కాని ప్రశ్న..


పోనీ.. ఈ సమస్యలకు పరిష్కారం ఇచ్చేలా అధికారులపై జనసేన ఒత్తిడి చేసే అవకాశం ఉందా.. అంటే అనుమానమే.. ప్రజలు నేరుగా వస్తే చేయని అధికారులు.. ఇప్పుడు పవన్ కల్యాణ్ జోక్యం చేసుకుంటే మాత్రం చేస్తారా. ఒకవేళ ఒకటో, రెండో అయితే.. పవన్ కల్యాణ్‌ అడిగాడని చేసి పెట్టే అవకాశం ఉంది. కానీ.. వందలు వేల సంఖ్యలో ఫిర్యాదులు వస్తే అధికారులు మాత్రం స్పందిస్తారా..  అధికారులు సరిగ్గా స్పందించకపోతే.. పవన్న కల్యాణ్ ఏం చేస్తారు.. ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి.


కీలకమైన విషయం ఏంటంటే.. పవన్ కల్యాణ్ పిలుపు మేరకు రాష్ట్రంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చిన బాధితులకు తగిన న్యాయం జరిగితే మంచిదే.. కానీ.. అలా జరగకపోతే.. బాధితులు పడిన కష్టం వృథా అవుతుంది. ప్రచారం కోసం ఏదో కార్యక్రమం నిర్వహించి..నేను మీ ఫిర్యాదు ప్రభుత్వానికి పంపాను..ఈ ప్రభుత్వం ఏమీ చేయడం లేదు అని సమాధానం చెప్పి వదిలేస్తే ప్రయోజనం ఉండదు. మరి ఈ సమస్యల పరిష్కారం కోసం పవన్ ఏం చేస్తారో ముందు ముందు చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: