చంద్రబాబు రాయలసీమలో పార్టీ బలోపేతంపై దృష్టిసారించారు. ఇవాళ్టి నుంచి 3రోజుల పాటు చంద్రబాబు రాయలసీమ జిల్లాల్లో పర్యటించనున్నారు. అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో సాగే ఈ పర్యటనలో జిల్లా మహానాడు, నియోజకవర్గాల వారీ సమీక్ష నిర్వహిస్తారు. బాదుడు బాదుడే రోడ్ షో నిరసన కార్యక్రమాలు చేపడతారు. అలాగే..  కుప్పంలో జోక్యం చేసుకుంటూ పెత్తనం చలాయించేందుకు యత్నిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అతని అడ్డాలోనే కట్టడి చేయాలన్నది చంద్రబాబు ప్లాన్‌గా తెలుస్తోంది.


చిత్తూరు జిల్లా రాజకీయాలను మంత్రి పెద్దిరెడ్డి ఒంటి చేత్తో శాసిస్తున్నారు. పుంగనూరు నుంచి మంత్రి పెద్దిరెడ్డి , రాజాం పేట పార్లమెంట్ నుంచి అయన కుమారుడు మిధున్‌ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అటు పక్క తంబళ్ళ పల్లి నుంచి సోదరుడు ద్వారకానాధ్ రెడ్డి కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. అలా చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబం కీలక పాత్ర పోషిస్తోంది. టీడీపీ నేతలకు పంటి కింద రాయిగా పెద్దిరెడ్డి కుటుంబం మారింది.


మరో విషయం ఏంటంటే.. చంద్రబాబు, పెద్దిరెడ్డిల మధ్య వివాదాలు ఈనాటివి కావు. తిరుపతి ఎస్ వి ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ చదివే రోజుల్లోనే వీరిద్దరూ గ్రూపు రాజకీయాలు నిర్వహించుకున్నారు. ఆనాటి నుంచి ఈనాటికీ వీరి మధ్య రాజకీయ విభేదాలు అదే స్థాయిలో కొనసాగుతున్నాయి. అందుకే పెద్దిరెడ్డి ఇటీవల కుప్పం నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. చంద్రబాబును ఎలాగైనా కుప్పంలో ఓడించి పరువు తీయాలని ప్లాన్ చేస్తున్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి చెక్ పెట్టి మంచి హుషారుగా ఉన్నారు.


అందుకే పెద్దిరెడ్డిని ఎలాగైనా కట్టడి చేయాలని తెలుగుదేశం భావిస్తోంది. పెద్దిరెడ్డి నియోజకవర్గం పుంగనూరులో గట్టి అభ్యర్థిని పెట్టి ఆయనను ముప్పుతిప్పలు పెట్టాలని ప్లాన్ చేస్తోంది. అలా చేస్తే.. పెద్దిరెడ్డి తన నియోజక వర్గంలో బిజీ అవుతారని.. కుప్పం వైపు చూడరని చంద్రబాబు టీమ్ భావిస్తోంది. ఇందులో భాగంగానే పుంగనూరులో పెద్దిరెడ్డికి ధీటుగా చల్లా బాబురెడ్డిని తెలుగుదేశం ఇన్ఛార్జ్ గా నియమించింది. మరి ఈ వ్యూహం ఎంత వరకూ వర్కవుట్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: