భారత సంతతికి చెందిన బ్రిటన్‌ మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌ త్వరలో బ్రిటన్ ప్రధాని అవబోతున్నాడా.. ఒక భారత సంతతి వ్యక్తి మొదటి బ్రిటన్ ప్రధాని అయ్యి చరిత్ర సృష్టించబోతున్నాడా.. బోరిస్‌ జాన్సన్‌ స్థానంలో తదుపరి ప్రధాన మంత్రి అభ్యర్థిగా తన స్థానం మెరుగుపరుచుకుంటున్నాడా.. అంటే అవుననే సమాధానం వస్తోంది. బ్రిటన్ ప్రధానిగా బోరిస్ జాన్సన్‌ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే బ్రిటన్‌కు కొత్త ప్రధాని రాబోతున్నాడు.


ఆ కొత్త ప్రధాని మనోడు రిషి సునాక్‌ అవుతాడన్న అంచనాలు ఏర్పడుతున్నాయి. ఈ రిషి సునాక్‌ మన ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తి అల్లుడన్న సంగతి తెలిసిందే. ఆయన అధికార కన్జర్వేటివ్‌ పార్టీ నేతగా ఎన్నికయ్యేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆ పదవి కోసం జరుగుతున్న రేసులో అందరి కన్నా రిషి సునాక్ ముందున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు రిషి సునాక్‌కు తమ మద్దతు ప్రకటించారు. నిన్న కూడా పలువురు కన్జర్వేటివ్‌ పార్టీ ఎంపీలు, నేతలు రిషికి మద్దతు ప్రకటించారు.


రిషి సునాక్‌కు మద్దతు ప్రకటించిన వారిలో ఆ పార్టీ నేత మార్క్‌ స్పెన్సర్‌, పార్టీ మాజీ ఛైర్మన్‌ ఆలివర్‌ డౌడెన్‌, మాజీ మంత్రి లియామ్‌ ఫాక్స్‌ వంటి వారు ఉన్నారు. మాజీ ఆర్థిక మంత్రిగా, బ్రెగ్జిట్‌కు అనుకూలమైన వ్యక్తిగా రిషి సునాక్‌ కు ప్రత్యేకమైన  గుర్తింపు ఉంది. రిషి సునాక్‌ అయితేనే  పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తీసుకురాగలరని చాలా మంది భావిస్తున్నారు. అలాగే బ్రిటన్  ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను రిషి సునాక్ తన అనుభవంతో సమర్థంగా ఎదుర్కోగలరనే అభిప్రాయం ఎక్కువ మందిలో వ్యక్తం అవుతోంది.


అంతే కాదు.. ఈ రేసులో ఇప్పటి వరకూ ఒక బలమైన అభ్యర్తఇగా ఉన్న రక్షణ మంత్రి బెన్‌ వాలెస్‌.. తాను ప్రధాన మంత్రి పోటీ నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించడం రిషి సునాక్‌కు బాగా కలిసివస్తోంది. బెన్ వాలెస్ నిర్ణయంతో రిషి అభ్యర్థిత్వానికి మరింత మద్దతు లభించే అవకాశం ఏర్పడింది. కరోనా సమయంలో బ్రిటన్ ఆర్థిక శాఖను సమర్థంగా నడిపించిన అనుభవం రిషి సునాక్‌కు ఉంది. ఇప్పటి వరకూ రిషి సునాక్‌కే బ్రిటన్ ప్రధాని అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: