కేసీఆర్‌కు రాజకీయ చాణక్యుడిగా పేరుంది. ఆయన వ్యూహాలు ప్రత్యర్థుల అంచనాలకు అందకుండా ఉంటాయి. అలాంటి కేసీఆర్ మరోసారి ముందస్తు పాచిక వేయబోతున్నారా..అన్న అనుమానాలు వస్తున్నాయి. గతంలో 2018లో ఇదే పాచిక వేసి.. ఆయన రెండోసారి వరుసగా తెలంగాణ సీఎం అయ్యారు. ఇప్పుడు కూడా మరోసారి అదే వ్యూహం అనుసరించబోతున్నారేమో అన్న అనుమానాలు నిన్నటి ప్రెస్ మీట్ తర్వాత రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తున్నాయి.


తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్‌లకు ముందస్తు ఎన్నికలకు వచ్చే దమ్ముందా అని నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిలదీశారు. అంతే కాదు.. ముందస్తుకు తేదీలు ఖరారు చేస్తే తామూ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకెళ్తామని సవాల్‌ విసరడం ద్వారా ఆయా పార్టీలను ఆయన ఆత్మరక్షణ ధోరణిలో పడేశారు. ప్రగతిభవన్‌లో మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాలు, ముందస్తు ఎన్నికల ఊహాగానాలపై స్వయంగా క్లారిటీ ఇచ్చేశారు.


దేశరాజకీయాల్లో గుణాత్మక మార్పే లక్ష్యంగా జాతీయస్థాయిలో టీఆర్ఎస్‌ కీలక పాత్ర పోషిస్తుందని కేసీఆర్ మరోసారి చెప్పారు. దేశానికి తెలంగాణనే ఆదర్శమంటున్న కేసీఆర్.. దేశం ప్రమాదంలో ఉంటే చూస్తూ తాము ఊరుకోబోమని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో మోదీ సర్కార్‌ను.. గద్దె దింపి తీరుతామని కేసీఆర్‌ ధీమాగా చెప్పుకొచ్చారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమించిన కేసీఆర్  రానున్న రోజుల్లో దేశం కోసం కూడా పోరాడుతాడని స్పష్టం చేశారు.


అవసరమైతే ఇందుకోసం టీఆర్‌ఎస్‌ను జాతీయ పార్టీగా మారిస్తే తప్పేముందని కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణకోసం అనేక పార్టీలను ఒప్పించిన అనుభవం తనకు ఉందని కేసీఆర్ గుర్తు చేశారు. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో మార్పుకో సం అదే రీతిలో సానుకూల ఫలితాలు తీసుకొస్తామని కేసీఆర్ ధీమాగా చెప్పుకొచ్చారు. మొత్తానికి కేసీఆర్ మరోసారి ముందస్తు వ్యాఖ్యలు చేసి రాజకీయ కలకలం సృష్టించారు. ఈ వ్యూహం ఫలిస్తుందా.. ఎన్నికలకు కాంగ్రెస్, బీజేపీ సిద్ధంగా ఉన్నాయా.. కేసీఆర్ ఈమేరకు పార్టీని ముందుగానే సిద్ధం చేసి ఉంచుకున్నారా.. ఇవీ ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో జోరుగా చర్చకు దారి తీస్తున్న అంశాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: