ఏపీ సీఎం జగన్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెలాఖరు నుంచి ప్రజా దర్భారు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి పెద్ద ఎత్తున వస్తున్న ఫిర్యాదులు, విమర్శల నేపథ్యంలో సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ జనవాణి పేరిట ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి బాగానే స్పందన వస్తోంది.


ఇలా ప్రతిపక్షం చేయడం బహుశా జగన్‌ను ఆలోచింపజేసిందేమో తెలియదు కానీ.. ఇప్పుడు సీఎం జగన్ కూడ ప్రజల నుంచి విజ్ఞప్తులు నేరుగా స్వీకరించేందుకు ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఉదయం వేళ సాధారణ ప్రజలను ప్రజాదర్భార్ ద్వారా కలవనున్న సీఎం జగన్.. మధ్యాహ్నం నుంచి పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులతోనూ భేటీ అయ్యే అవకాశముందని తెలుస్తోంది. ఈ మేరకు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ఏర్పాట్లు చేస్తున్నారు.


ఈ నెలాఖరు నుంచే ఈ ప్రజాదర్భారు నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఆలోచన కొత్తదేమీ కాదని అంటున్నారు వైసీపీ నేతలు.. వాస్తవానికి అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే దీన్ని ప్రారంభించాలని అనుకున్నారట. అయితే.. అనేక కారణాలతో ఆ ఆలోనచ పట్టాలెక్కలేదు. ఆ తర్వాత కూడా  వివిధ సందర్భాల్లో ప్రజాదర్భార్ కార్యక్రమాన్ని  చేపట్టి ప్రజల నుంచి వినతులు స్వీకరించాలనుకున్నా.. కరోనా పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం వాయిదా పడుతూ వస్తోంది.


ఇప్పటికే జగన్ సర్కారు స్పందన కార్యక్రమం ద్వారా వివిధ జిల్లాల కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాల నుంచి వినతులు, దరఖాస్తులు స్వీకరిస్తోంది. అయితే ప్రజాదర్భార్ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహిస్తే మంచి ఇమేజ్‌ వచ్చే అవకాశం ఉందన్న ఆలోచన కూడా ఉంది. ఎన్నికల వేడి మొదలవుతున్న నేపథ్యంలో జగన్ తీసుకున్న ఈ నిర్ణయం ఎలాంటి ఫలితాలు ఇస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: