తెలంగాణలో వరదలు జోరుగా ఉన్నాయి. వారం రోజుల నుంచి రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు, ప్రత్యేకించి గోదావరి పరీవాహక ప్రాంతాలు నీళ్లలోనే ఉన్నాయి. భద్రాచలం వద్ద గత 30 ఏళ్లలో ఎన్నడూ లేనంత వరద వచ్చింది. అనేక జిల్లాల్లోని వేల గ్రామాలు ముంపులో ఉన్నాయి. కడెం ప్రాజెక్టు వద్ద ప్రమాదకర పరిస్థితి వచ్చింది. కాళేశ్వరం వంటి ప్రాజెక్టు పంపు హౌసులు కూడా మునిగిపోయాయి.


అయితే.. ఇంత జరుగుతున్నా సీఎం కేసీఆర్ సమీక్షలు మినహా ప్రగతి భవన్ నుంచి కదలలేదు. సాధారణంగానే కేసీఆర్‌ ఇలాంటి చోట్లకు పర్యటనలు చేయరు.. అయితే.. ఈసారి మాత్రం విపక్షాలు కేసీఆర్‌ను టార్గెట్ చేశారయి. ఇంత జల ప్రళయం వచ్చినా కేసీఆర్‌ ప్రగతి భవన్ గడప దాటడం లేదని విపక్షాలు విమర్శిస్తున్న సమయంలో ఎట్టకేలకు సీఎం కేసీఆర్ కదిలారు. వరద ప్రభావిత ప్రాంతాలలో ఏరియల్ సర్వే నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.


భారీ వర్షాల నేపథ్యంలో చోటు చేసుకున్న ప్రకృత్తి విపత్తు, గోదావరి పరీవాహక ప్రాంతంలో పోటెత్తిన వరదలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ, రేపు ఏరియల్‌ సర్వే  నిర్వహిస్తారు. కడెం నుంచి భధ్రాచలం వరకున్న గోదావరి పరీవాహక ప్రాంతం వరకు కేసీఆర్‌ ఏరియల్‌ సర్వే నిర్వహించే అవకాశం ఉంది. ఏరియల్‌ సర్వేలో సీఎంతో పాటు సీఎస్‌ కూడా పాల్గొంటారు. సిఎం చేపట్టే ఏరియల్ సర్వేకు సంబంధించిన హెలికాప్టర్ రూటు సహా తదితర విధి విధానాలను అధికార యంత్రాంగం పర్యవేక్షించి రూట్ ను ఫైనల్ చేసింది.


ప్రజారోగ్య సంరక్షణలో భాగంగా, వరదల వల్ల అంటువ్యాధులు ప్రబలకుండా సిఎం కెసిఆర్ ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉందని సీఎంఓ తెలిపింది. సీఎం ఆదేశాల మేరకు గోదావరి వరద ముంపు ప్రాంతాల్లోని దవాఖానాలకు చెందిన డాక్టర్లు, ఉన్నతాధికారులతో నిన్న వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సమీక్షా సమావేశం  నిర్వహించారు. ఇవాళ్టి  సిఎం పర్యటన నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

KCR