భారీ వర్షాలు, వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రాంతాల్లో నిన్న తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో  వైరల్ అవుతున్నాయి. భారీ వర్షాల వెనుక విదేశీ కుట్ర ఉందంటూ ఆయన చేసిన కామెంట్లు మరీ వైరల్ అవుతున్నాయి. కేసీఆర్ కామెంట్‌పై విపక్షాలు మండిపడుతున్నాయి. భారీ వర్షాల వెనుక విదేశీ కుట్ర ఉందనడం ఈ శతాబ్దపు జోక్ అంటూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు.


కేసీఆర్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి డ్రామాలాడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. అలాగే తన పర్యటనలో 10 వేల ఇండ్లతో కాలనీ నిర్మిస్తాన్ని.. బాధితులకు కుటుంబానికి రూ. 10 వేలు సాయం ఇస్తామని ప్రకటించడం.. గోదావరిపై కరకట్ట నిర్మాణం వంటి హామీలు ఇచ్చారు. వీటిపైనా ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. వారం రోజులుగా వరదలతో జనం అల్లాడుతుంటే పట్టించుకోని సీఎం కేసీఆర్.. ప్రాంతీయ పార్టీల నేతలతో రివ్యూలు చేస్తూ కేంద్రాన్ని బదనాం చేయడానికే పరిమితమయ్యారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  విమర్శించారు.


కుట్రలకే పెద్ద కుట్రదారుడు కేసీఆర్ అంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. భారీ వర్షాల వెనుక విదేశీ కుట్ర ఉందంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించడం హాస్యాస్పదమన్నారు.  సీఎంకు మతి భ్రమించినట్లుందన్న సంజయ్.. ఆయనను ఎర్రగడ్డ ఆసుపత్రిలో చేర్పించి మెరుగైన చికిత్స అందించాల్సిన అవసరం ఉందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ వరద ముంపు ప్రాంతాల పర్యటనను చూసి జనం నవ్వుకుంటున్నారని.. ముఖ్యమంత్రి వరద ప్రాంతాల్లో పర్యటిస్తే బాధితులకు భరోసా కలగాలని... ఆదుకుంటారనే నమ్మకం ఏర్పడాలని... కానీ ఈ సీఎం అక్కడికి వెళ్లి చేసిన కామెంట్స్ జోకర్ ను తలపిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  విమర్శించారు.


హైదరాబాద్ వరద ముంపు బాధితులకు రూ.10 వేల సాయం చేస్తానని హామీ ఇచ్చి ఎగ్గొట్టిన చరిత్ర కేసీఆర్ సొంతమని బండి సంజయ్‌ గుర్తు చేశారు. మొత్తానికి ఇలా కేసీఆర్ తన మాటలతో నవ్వులపాలవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: