దేశంలో లోక్‌సభ, అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలి.. ఇది మోడీ ఆలోచన.. అయితే.. దీన్ని అమలు చేయడం అంత సులభం కాదు.. దీనికి ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. అయితే.. ఈ జమిలి ఎన్నికలు ఎప్పటి నుంచి అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. తాజాగా ఈ అంశంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. జమిలి ఎన్నికలు నిర్వహించే అంశం.. లా కమిషన్‌ పరిశీలనలో ఉందని కేంద్రం పార్లమెంటులో తెలిపింది.


ఈ జమిలి ఎన్నికలు అంశంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, కేంద్ర ఎన్నికల సంఘం సహా అనేక భాగస్వామ్య పక్షాలతో ఇప్పటికే చర్చించినట్లు కేంద్రం తెలిపింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు లోక్‌సభలో సభ్యులకు వివరాలు వెల్లడించారు. జమిలి ఎన్నికలపై ఎంపీ భగీరథ చౌదరి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక కేంద్ర మంత్రి రిజిజు ఈ సమాధానం ఇచ్చారు. స్టాండింగ్ కమిటీ తన నివేదికలో కొన్ని ప్రతిపాదనలు, సిఫార్సులు చేసినట్టు మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.


ఈ నివేదిక ఆధారంగా లా కమిషన్ జమిలి ఎన్నికల నిర్వహణకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తుందట. దీనిపై అధ్యయనం చేస్తూ ఒక ప్రణాళికను తయారు చేసే పనిలో ఉన్నట్టు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు తెలిపారు. తరచూ ఎన్నికలు జరుగుతున్నందున నిత్యావసర సేవలు సహా ప్రజా జీవితంపై ప్రతికూల ప్రభావితం పడుతుందట.  ఈమేరకు స్టాండింగ్ కమిటీ తన నివేదికలో పేర్కొన్నట్టు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు  వెల్లడించారు.


అంతే కాకుండా  లోక్‌సభ, శాసనసభలకు వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించడం వల్ల ప్రజాధనం భారీగా ఖర్చవుతోందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు  తెలిపారు. 2014-22 మధ్యకాలంలో మొత్తం యాభై వరకూ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు వివరించారు. ఈ ఎనిమిదేళ్లలో ఈ ఎన్నికల కోసం మొత్తం 7వేల కోట్ల రూపాయలకుపైనే ఎన్నికల నిర్వహణపై ఖర్చు పెట్టాల్సి వచ్చిందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు పార్లమెంటులో వివరించారు. అయితే.. మరి జమిలి ఎన్నికలు ఎప్పుడు పెడతారన్న అంశంపై ఇంకా క్లారిటీ రానట్టే కదా.

మరింత సమాచారం తెలుసుకోండి: